Monday, December 23, 2024

పాక్‌లో ఆత్మాహుతి దాడి

- Advertisement -
- Advertisement -

పెషావర్ : పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తూన్‌క్వా ప్రాంతంలో ఆదివారం జరిగిన ఓ శక్తివంతమైన పేలుడు ఘటనలో కనీసం 39 మంది మృతి చెందారు. 120 మంది వరకూ గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. సూసైడ్ బాంబర్ ఈ సమావేశ స్థలి వద్ద తనను తాను పేల్చుకున్నందునే ఈ దుర్ఘటన జరిగింది. అఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని ఈ కల్లోలిత ఖైబర్ ప్రాంతపు బజౌర్ గిరిజన జిల్లా రాజధాని ఖార్‌లో జమాయిత్ ఏ ఇస్లాం ఫజ్లు (జెయుఐఎఫ్) కార్యకర్తల సదస్సు జరుగుతుండగా పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ పేలుడు తరువాత సదస్సు ప్రాంతం అంతా రక్తసిక్తంగా మారింది. గాయపడ్డ పలువురిని స్థానిక ఆసుపత్రులకు చికిత్సకోసం తరలించారు. పేలుడుకు కారణాలు వెంటనే తెలిసిరాలేదు. అయితే ఇది ఆత్మాహుతి దాడి అని ప్రాధమిక సమాచారం ద్వారా తెలిసింది. దీనికి బాధ్యులు ఎవరనేది నిర్థారించుకోవల్సి ఉంది.

భద్రతా బలగాలు ఈ ప్రాంతాన్ని చేరుకుని కట్టడి చేశాయి. సదస్సుకు దాదాపు 500 మంది కార్యకర్తలు హాజరైనట్లు వెల్లడైంది. ఈ సంస్థ ప్రభుత్వానికి సంకీర్ణ భాగస్వామ్య పక్షంగా ఉంది. దీనికి అత్యంతపలుకుబడిగల తీవ్రవాదపు మతనేత నాయకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో రాకపోకలను నిలిపివేశారు. సహాయక బృందం 1122 అధికార ప్రతినిధి బిలాల్ ఫైజి డాన్ పత్రిక విలేకరులతో మాట్లాడారు. సహాయక చర్యలకు ఇక్కడికి వెంటనే ఐదు అంబులెన్స్‌లను తరలించినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో జరిగిన సదస్సుకు తాను కూడా హాజరు కావాల్సి ఉందని , అయితే వ్యక్తిగత కారణాలతో చివరి క్షణంలో పర్యటన రద్దు అయిందని జెయుఐ ఎఫ్ నేత హఫీజ్ హమీదుల్లా తెలిపారు.ఆయన కూడా ఈ ఘటనలో మృతి చెందినట్లు తొలుత కొన్ని టీవీఛానళ్లు, వార్తా సంస్థలు తెలిపాయి. అయితే ఇది నిజం కాదని హమీదుల్లా తెలిపారు. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఇది జిహాద్ చర్య కాదని, కేవలం ఉగ్రవాద దుశ్చర్య అని తెలిపారు.

మానవతపై, ఈ ప్రాంతంపై జరిగిన దాడి అని ప్రకటించారు. ఇంతకు ముందు కూడా తమ సంస్థను లక్షంగా చేసుకుని దాడులు జరిగాయని, కొన్ని శక్తులు తమ కార్యకర్తలను టార్గెట్ చేసుకున్నారని, వీరిని ఎవరూ క్షమించరాదని తెలిపారు. తమ అణచివేత జరుగుతోందని, పార్లమెంట్‌లో తెలియచేశామని, అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు మరో ఘోరం జరిగిందని విమర్శించారు. బాధిత కుటుంబాలకు ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి తగు వైద్య సాయం , పునరావాసం కల్పించాల్సి ఉందని ప్రాంతీయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇస్లామాబాద్‌లో జెయుఐ ఎఫ్ వ్యవస్థాపక నేత మౌలానా ఫజ్లూర్ రెహ్మన్ ఈ ఘటనపై స్పందించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్, ప్రాంతీయ తాత్కాలిక ముఖ్యమంత్రి ఆజాం ఖాన్ వెంటనే ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాలని, బాధ్యులను తేల్చాల్సి ఉందన్నారు.

కార్యకర్తలు వెంటనే ఆసుపత్రులకు చేరుకుని క్షతగాత్రులకు రక్తం దానం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి ఖాన్, ఈ ప్రాంత గవర్నర్ , జెయుఐఎఫ్ కేంద్ర కమిటీ సభ్యులు కూడా అయిన హాజీ గులాం అలీ ఘటనను ఖండించారు. మృతుల సంఖ్యను నిర్థారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News