హైదరాబాద్ : ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రంలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. మొన్న ఇద్దరు సిఐఎస్‌ఎఫ్ జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. జవాన్ వికాస్‌సింగ్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం జవాన్ వికాస్‌సింగ్ సతీమణి ప్రియాసింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. నర్మద గెస్ట్‌హౌస్‌లో తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త మరణాన్ని తట్టుకోలేకే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. మొన్న ఒకే రోజు ఇద్దరు సిఐఎస్‌ఎఫ్ జవాన్లు ఆత్మహ త్యకు పాల్పడ్డారు.
24 గంటల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వ్యక్తిగత కారణాలతోనే ఇద్దరు జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని భావిస్తున్నారు. 2015 బ్యాచ్‌కు చెందిన సిఐఎస్‌ఎఫ్ ఎస్‌ఐ వికాస్ సింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తూ.. గతేడాది నవంబర్‌లో బదిలీపై వచ్చారు. ముంబయిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో క్రమశిక్షణ చర్యలకు గురైనట్లు తెలిసింది.