న్యూఢిల్లీ :అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన వ్యోమగామి సుల్తాన్ అల్ నెయాదీ గురువారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి తన కుమారులతో కాసేపు ముచ్చటించడం పలువురిని ఆకట్టుకుంది. ఈ ప్రత్యక్ష ప్రసారం వీక్షించిన వారి హృదయాలు భావోద్వేగాన్ని పొందాయి. అల్ నెయాదీ ఆరుగురు పిల్లల్లో ఇద్దరు, తన తండ్రి యుమ్ అల్ కున్‌లో ఏర్పాటు చేసిన ‘ ఎ కాల్ ఫ్రమ్ స్పేస్’ ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. అంతరిక్ష కేంద్రం నుంచి వెలువడిన ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని దేశానికి చెందిన అధినేతలు, అంతరిక్ష పరిశీలకులు వీక్షించ గలిగారు. మొత్తం ఏడు ఎమిరేట్స్‌లో ప్రసారమైన ఈ ఈవెంట్స్‌లో దేశం మొత్తం మీద 10 వేల మంది కన్నా ఎక్కువ మంది పాల్గొన్నారు. వ్యోమగామి అల్ నెయాదీ కుమారుల్లో ఒకరు అబ్డల్లా తన తండ్రిని భూమిపై దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు ? అని ప్రశ్నించాడు.
దానికి అల్ నెయాదీ “భూమిపై నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తివి నువ్వే” అని బదులిచ్చారు. అంతరిక్షంలో నాకు నచ్చిందేదని నువ్వు అనుకుంటున్నావా? మేం ఇక్కడ సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి కలిగిన వాతావరణంలో ఉన్నాం. ఇక్కడ నువ్వు కూడా ఇష్టపడే అనేక పనులు చేయగలుగుతున్నాం. ఒక చోట నుంచి మరో చోటికి ఎగరడం వంటివి చేస్తున్నాం” అని తన కుమారుడు అబ్దల్లాకు అల్ నెయాదీ వివరించారు. అరబ్ ఎమిరేట్స్‌లో మొహమ్మద్ బీన్ రషీద్ స్పేస్ సెంటర్ తన సోషల్ మీడియా ఛానెల్స్ ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చేయగలిగింది. అల్ నెయాదీ ఆర్నెలల స్పేస్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఆరునెలల కాలం ఆగస్టు 31తో పూర్తి కానుండగా, అంతరిక్ష కేంద్రం నుంచి ఆయన ఆఖరి ప్రత్యక్ష ప్రసారంలో పాలు పంచుకున్నారు.