Monday, December 23, 2024

Karnataka Elections: కర్నాటక ఎన్నికల్లో సుమలతకు కీలక పాత్ర: బిజెపి యోచన

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: మరికొద్ది రోజుల్లో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను పుర్కరించుకుని దక్షిణ కర్నాటక ప్రాంతం ముఖ్యంగా జెడి(ఎస్)కు కంచుకోటగా భావిస్తున్న మాండ్య జిల్లాలో బిజెపి ఎంపి, అలనాటి సినీ నటి సుమలత అంబరీష్‌ను బరిలోకి దింపాలని బిజెపి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మాండ్య అసెంబ్లీ స్థానం నుంచి సుమలతను బరిలోకి దించాలని బిజెపి భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సుమలత పోటీ చేయడమేకాక మాండ్య జిల్లాలోని మరో 6 అసంఎబ్లీ నియోజకవర్గాలలో పార్టీ తరఫున స్టార్ క్యాపెయినర్‌గా ఆమె పనిచేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇటీవలే బిజెపిలో చేరిన సుమలత 2019 పార్లమెంటరీ ఎన్నికలలో మాండ్య నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. 2019 ఎన్నికలలో ఆమె అభ్యర్థిత్వానికి బిజెపి మద్దతు ప్రకటించింది. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జెడిఎస్ నాయకుడు హెచ్‌డి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారసామిని లక్షకు పైగా ఓట్ల తేడాతో సుమలత ఓడించారు. వొక్కలిగ కులంలో ప్రముఖుడైన కన్నడ సూపర్‌స్టార్ దివంగత అంబరీష్ సతీమణి అయిన సుమలత తన భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం నుంచి పార్లమెంట్‌కు పోటీచేసి గెలిచారు.

మూడు దశాబ్దాల రాజకీయ అనుభవంగల అంబరీష్‌కు మాండ్యలో పెద్దసంఖ్యలో అభిమానులు, అనుచరులు ఉన్నారు.
దక్షిణ కన్నడ ప్రాంతంలో 57 అసెంబ్లీ స్థానాలు ఉండగా వీటిలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని బిజెపి భావిస్తోంది. ఇందుకోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యూహరచన చేస్తున్నారు. మాండ్య, హసన్ జిల్లాలలో ఏడేసి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలలో ఒక్కో స్థానాన్ని బిజెపి గెలుచుకోగా మిగిలిన స్థానాలను జెడిఎస్ గెలుచుకుంది. జెడిఎస్ పార్టీకి ఈ జిల్లాలలో మంచి పట్టు ఉంది. సుమలత రాకతో ఈ జిల్లాలలో ఎన్నికల అంచనాలు మారిపోయే అవకాశం ఉంది. సుమలత ప్రచారం వల్ల వొక్కలిగ కులస్థులకు చెందిన ఓటర్లు సంఘటితమయ్యే అవకాశం ఉంది. కుమారస్వామి, కర్నాటక పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్‌కు దీటుగా సుమలతను వొక్కలిగ ప్రతినిధిగా బిజెపి ఎన్నికల తెరపైకి తీసుకురావాలని యోచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News