Monday, November 18, 2024

నేను బతికే ఉన్నాను

- Advertisement -
- Advertisement -

Sumitra Mahajan's explanation on false news

తప్పుడు వార్తపై సుమిత్రా మహాజన్ వివరణ

ముంబయి: లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మరణించారంటూ గురువారం రాత్రి తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో, కొన్ని టివి ఛానళ్లలో ప్రసారం కావడంతో తాను బతికే ఉన్నానంటూ సుమిత్రా మహాజన్ స్వయంగా వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. సుమిత్రా మహాజన్ మృతిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపి శశి థరూర్ గురువారం రాత్రి ట్వీట్ చేయడం కలకలం సృష్టించింది. అయితే 78 ఏళ్ల సుమిత్రా మహాజన్ ఆరోగ్యంగా ఉన్నారని బిజెపి నాయకులు వెంటనే స్పందించడంతో వెంటనే ఆయన తన ట్వీట్లను తొలగించారు.

దీనిపై సుమిత్రా మహాజన్ శుక్రవారం ఒక ఆడియో ద్వారా వివరణ ఇస్తూ ఎటువంటి నిర్ధారణ చేసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు తన మరణ వార్తను ప్రకటిస్తే తానేం చేయగలనని అన్నారు. కనీసం ఇండోర్‌లోని జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి ఈ వార్తలోని నిజానిజాలను నిర్ధారించుకోవలసి ఉండేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

ఈ తప్పుడు వార్త దేశమంతటా పాకిపోయిందని, ముంబయిలోని తన బంధువుల నుంచి రాత్రి నుంచే ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయని సుమిత్ర తెలిపారు. ఈ తప్పుడు వార్త ఎవరు ఇచ్చారని శశి థరూర్‌ను తన సోదరుని కుమార్తె ఫోన్‌లో ప్రశ్నించినట్లు ఆమె చెప్పారు. కాగా..సుమిత్రా మహాజన్ మృతిపై తాను చేసిన ట్వీట్‌ను డెలిట్ చేసిన శశి థరూర్ ఆ తర్వాత ఆమె ఆరోగ్యంగా ఉన్నారని తెలియడంతో సంతోషించానని చెప్పారు. విశ్వసనీయ వర్గం నుంచి అందిన సమాచారం మేరకే తాను ఆ ట్వీట్ చేశానని ఆయన చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News