Monday, December 23, 2024

బిజెపి పరువునష్టం కేసులో అతిషికి సమన్లు

- Advertisement -
- Advertisement -

జూన్ 29న హాజరుకావాలని కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: తమ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేందుకు బిజెపి నాయకులు ప్రలోభ పెట్టారంటూ చేసిన ఆరోపణలపై బిజెపి దాఖలు చేసిన పరువునష్టం కేసులో జూన్ 29న హాజరుకావాలంటూ ఢిల్లీ కోర్టు మంగళవారం ఢిల్లీకి చెందిన ఆప్ మంత్రి అతిషికి సమన్లు జారీచేసింది. తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ. 25 కోట్ల ను ఎరగా చూపించి వారిని ప్రలోభ పెట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందంటూ అతిషి ఈ కొద్ది నెలల క్రితం ఆరోపించారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కోవడానికి బిజెపి ప్రయత్నించిందని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆరోపించారు.

కాగా..ఈ ఆరోపణలను బిజెపి ఖండించింది. ఇవి నిరాధార, అసత్య ఆరోపణలని ప్రకటించిన బిజెపి ఇందుకు తగిన ఆధారాలను చూపాలని కేజ్రీవాల్‌ను అతిషిని డిమాండ్ చేసింది. ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు వీరిద్దరికీ నోటీసులు కూడా ఇచ్చారు. కాగా..తన రాజకీయ జీవితాన్ని కాపాడుకునేందుకు బిజెపిలో చేరాలని తనను కూడా ప్రలోభ పెట్టేందుకు బిజెపి ప్రయత్నించిందని అతిషి ఆరోపించారు. తనకు బాగా సన్నిహితులైన వ్యక్తి ద్వారా బిజెపి ఈ ఆఫర్ తీసుకువచ్చిందని ఆమె చెప్పారు. పార్టీ మారకపోతే నెలరోజుల్లో ఇడి అరెస్టు చేస్తుందని కూడా బిజెపి నాయకులు బెదిరించారని ఆమె ఆరోపించారు. దీంతో బిజెపి ఆమెపై పరువునష్టం పిటిషన్ దాఖలు చేయడంతోపాటు బహిరంగ క్షమాపణలను డిమాండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News