గాలిలో తేమ, వేడి కారణంగా ఉక్కపోత అధికం…
రానున్న మూడురోజులు పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం
జూన్ 8 నాటికి తెలుగు రాష్ట్రాలను తాకనున్న నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ రెండో వారం నుంచి వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉందని, అప్పటివరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో తేమ కారణంగా, వేడి కారణంగా ఉక్కపోతగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రానున్న నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. దక్షిణ ద్వీపకల్ప భారతదేశం మీదుగా అరేబియా సముద్రం నుంచి రుతుపవనాల పశ్చిమ గాలుల ప్రభావంతో, కోస్తా, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ, మహే, లక్షద్వీప్‌ల్లో రాబోయే ఐదు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.
రాబోయే ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈప్రకారం జూన్ రెండో వారం నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఎండలు మండుతుండగా అధికారులు ఆరెంజ్ అలర్టును జారీ చేశారు. శని, ఆది, సోమవారాల్లో ఎపి, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42- నుంచి 44 డిగ్రీల వరకు నమోదు అవుతాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. నైరుతి రుతుపవనాలు జూన్ 8 నాటికి తెలుగు రాష్ట్రాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.