Saturday, January 11, 2025

200 ఏళ్ల క్రితం నీలి రంగులో సూర్యుడు..బయటపడిన రహస్యం

- Advertisement -
- Advertisement -

దాదాపు 200 సంవత్సరాల క్రితం సూర్యుడు నీలి రంగులో కనిపించాడు. అయితే, చాలా కాలంగా రహస్యంగ ఉన్న ఈ సైన్స్ దృగ్విషయాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. 1831లో భూమిపై సంభవించిన భారీ అగ్నిపర్వత విప్ఫోటమే ఇందుకు కారణమని వారు తేల్చారు. అగ్నిపర్వతం పేలుడు నుంచి ఎగసిపడిన సల్ఫర్ డయాక్సైడ్ భూ వాతావరణంలోకి ప్రవేశించి భారీగా విస్తరించి మేటలు వేసిందని, అందుకే భూమి నుంచి చూస్తే సూర్యుడు నీలి రంగులో కనిపించాడని శాస్త్రవేత్తలు తేల్చారు. అగ్నిపర్వతం విస్ఫోటం కారణంగానే ఆ ఏడాది భూగ్రహంపై వాతావరణం చల్లబడిందని, విచిత్రమైన కొన్ని మార్పులు సంభవించాయని వారు వివరించారు. ఈ మేరకు ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ (పిఎన్‌ఎఎస్) జర్నల్‌లో ఒక అధ్యయనం ప్రచురితమైంది.

స్కాట్లాండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో ఈ విషయాలను నిర్ధారించారు. 1831లో వాతావరణ రికార్డులు అన్నింటినీ విస్తృతంగా విశ్లేషించిన తరువాత వారు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అగ్నిపర్వతం నుంచి, మంచు అంతర్భాగం నుంచి సేకరించిన రెండు బూడిదలను ల్యాబ్‌లో కలిపి విశ్లేషించగా అసలు విషయం బయటపడిందని అధ్యయన సహ రచయిత విల్ హచిసన్ తెలియజేశారు. సూర్యుడు నీలి రంగులో కనిపించడానికి కారణాన్ని తెలుసుకున్నామని ఆయన చెప్పారు. కాగా, ప్రస్తుతం రష్యా, జపాన్ మధ్య వివాదాస్పద భూభాగంలో ఉన్న సీముషీర్ ద్వీపంలోని ‘జవారీట్‌స్కీ’ అనే అగ్నిపర్వతం 1831లో పేలింది. ఆ ప్రకృతి విపత్తుకు సంబంధించిన వివరాలణు ఎవరూ రాతపూర్వకంగా నమోదు చేయలేదు. విస్ఫోటం సంభవించిన ద్వీపం చాలా దూరంలో ఉండడం, ఆ ప్రాంతంలో జనావాసాలు కూడా లేకపోవడతో ఆ రోజుల్లో ఎవరూ అంతగా పట్టించుకోలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News