సిఎస్‌కెకు నాలుగో ఓటమి
ముంబై: ఐపిఎల్ సీజన్15లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ సిఎస్‌కె వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సిఎస్‌కె 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (15), రుతురాజ్ గైక్వాడ్ (16) మరోసారి నిరాశ పరిచారు. అయితే స్టార్ ఆటగాళ్లు మోయిన్ అలీ, అంబటి రాయుడు మెరుగైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మోయిన్ అలీ 2 సిక్స్‌లు, మూడు ఫోర్లతో 48 పరుగులు చేశాడు. రాయుడు నాలుగు బౌండరీలతో 27 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్ రవీంద్ర జడేజా వేగంగా 23 పరుగులు చేశాడు. దీంతో చెన్నై స్కోరు 154 పరుగులకు చేరింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 17.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ శుభారంభం అందించారు. సమన్వయంతో ఆడిన కేన్ 32 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు అభిషేక్ ధాటిగా ఆడాడు. చెన్నై బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న అభిషేక్ ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. మరోవైపు విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిన రాహుల్ త్రిపాఠి 15 బంతుల్లోనే ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 39 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ సునాయాస విజయాన్ని అందుకుంది.