ముంబై: వరుస విజయాలతో ఐపిఎల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లాలనే పట్టుదలతో హైదరాబాద్ ఉంది. ఈ సీజన్‌లో గుజరాత్‌ను ఇప్పటికే ఓ మ్యాచ్‌లో ఓడించిన హైదరాబాద్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో హైదరాబాద్ సమతూకంగా ఉంది. బెంగళూరుతో జరిగిన కిందటి మ్యాచ్‌లో బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. జాన్సన్, నటరాజన్, భువనేశ్వర్, సుచిత్, ఉమ్రాన్ మాలిక్ తదితరులతో హైదరాబాద్ బౌలింగ్ చాలా బలంగా ఉంది. ఈ సీజన్‌లో వీరు అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోతున్నారు. జట్టు విజయాల్లో బౌలర్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా బౌలర్లపైనే జట్టు భారీ ఆశలు పెట్టుకొంది. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్‌క్రామ్, కెప్టెన్ విలియమ్సన్, వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌లతో బౌలింగ్ కూడా చాలా బలంగా ఉంది.
దీంతో ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించడం గుజరాత్‌కు అంత తేలిక కాదనే చెప్పాలి. మరోవైపు కొత్త టీమ్ గుజరాత్ కూడా వరుస విజయాలతో జోరుమీదుంది. ఏడు మ్యాచుల్లో ఆరింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి కిందటిసార సన్‌రైజర్స్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. శుభ్‌మన్ గిల్, మిల్లర్, హార్దిక్, తెవాటియా, రషీద్ తదితరులతో గుజరాత్ బలంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న గుజరాత్‌తో హైదరాబాద్‌కు గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది.