Monday, December 23, 2024

నెలలో ఒక రోజు.. సుందర తిరుమల-శుద్ధ తిరుమల ఆచరిస్తాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చగా ఉంచేందుకు టిటిడి పటిష్టమైన కార్యవర్గంతో ‘సుందర తిరుమల-శుద్ధ తిరుమల’ అనే నినాదాంతో ఇక నుంచి ప్రతి నెల శ్రమదానం కార్యక్రమం నిర్వహించనున్నట్లు టిటిడిటీ ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు. సోమవారం తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులతో కలిసి ఆయన శ్రమదానం (స్వచ్ఛంద పరిశుభ్రత సేవ) నిర్వహించారు.ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ,ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన తిరుమల, తిరుపతి దేవస్థానాలు ఎవరైనా వెళితే తలుపులు మూసివేసే కార్పొరేట్ సంస్థ కానీ, పరిశ్రమ కానీ కాదన్నారు. ముందస్తు నోటీసు లేకుండా మెరుపు సమ్మె చేయడం వంటి బెదిరింపులకు టిటిడి ఎన్నటికీ లొంగదన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులు శ్రీవారి హుండీలో సమర్పించే కానుకలతోనే అధికారులకు, ఉద్యోగులకు, శానిటరీ సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించి అంకితభావంతో సేవ చేయడం మన ముందున్న బాధ్యత అన్నారు. ఆపద సమయంలో భక్తుల సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చేయి చేయి కలిపి పరిస్థితిని చక్కదిద్దిన టిటిడి సిబ్బంది సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

జాతిపిత-మహాత్మా గాంధీ‘ ‘స్వచ్ఛత‘కి ఆదర్శంగా నిలిచారని, ఆయన ఎల్లప్పుడూ తన ప్రాంగణాన్ని స్వయంగా శుభ్రం చేసేవాడని, అందుకే ఈ రోజు స్వచ్ఛ భారత్ లోగోలో మహాత్ముని కళ్ళద్దాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక నుంచి ప్రతి ఉద్యోగి ‘సుందర తిరుమల-శుద్ధ తిరుమల’ కార్యక్రమంలో నెలలో ఒకరోజు పని చేయాలి” అని ఈవో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులతో సుందర తిరుమల-శుద్ధ తిరుమలపై ప్రతిజ్ఞ చేయించారు. మీడియాలో పారిశుధ్య కార్మికుల మెరుపు సమ్మె వార్తను తెలుసుకుని కర్నూలుకు చెందిన భీమ్‌రెడ్డి 100 మందికి పైగా సేవకులను తిరుమలకు తీసుకువచ్చి స్వచ్ఛందంగా పారిశుధ్య సేవలందిస్తున్నట్లు చెప్పారు.

స్వామివారి సేవలోనే కాకుండా ప్రత్యేకించి పారిశుధ్య సేవలందిస్తున్న శ్రీవారి సేవకులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు” తెలిపారు. తిరుమలలో జెఈవోలతో పాటు, జిల్లా కలెక్టర్, ఎస్పి, తిరుపతి మునిసిపల్ కమిషనర్ కూడా తమ మద్దతును అందించినట్లు తెలిపారు. చిత్తూరు, తిరుపతి, శ్రీ కాళహస్తి, నెల్లూరు, కడప మొదలైన సమీప ప్రాంతాల నుండి పారిశుద్ధ్య సిబ్బందిని తిరుమలకు రప్పించి, సంక్షోభాన్ని అధికమించిడానికి సేవలందించారన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఈవో కృతజ్ఞతలు తెలియజేశారు.జెఈవో వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, పిఆర్‌వో డాక్టర్ టి.రవి, ఎస్టేట్స్ ఓఎస్డీ మల్లికార్జునతో పాటు టిటిడిలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మీడియా సంఘీభావం

టిటిడి చేపట్టిన సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ తిరుమలలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రెస్‌క్లబ్, ఎస్‌ఎంసి, ఎస్‌ఎంజిహెచ్ తదితర పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News