Wednesday, January 22, 2025

సుందర్‌బన్ అడవులకు ముప్పు

- Advertisement -
- Advertisement -

ప్రపంచం మొత్తం మీద భారీ నదీ డెల్టా ప్రాంతం కలిగిన సుందర్‌బన్ దీవుల జీవావరణంలో మడ అడవుల మొత్తం విస్తీర్ణం 10,200 చదరపు కిలో మీటర్లు కాగా, అందులో భారత్‌లో 4200 చదరపు కిలో మీటర్ల లోను, బంగ్లాదేశ్‌లో 6000 చదరపు కిలో మీటర్ల లోనూ విస్తరించి ఉన్నాయి. సుందర్‌బన్ దీవుల్లోని మడ అడవులు సముద్ర తీర ప్రాంతాలకు పెట్టనిగోడలా తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కలిగిస్తుంటాయి. కానీ వాతావరణ మార్పులకు సముద్ర తీర మడ అడవులు, ఇతర వృక్షజాలం, మత్స సంపద హరించుకుపోతోందని, నేల కుంగి సముద్రం నీరుచొచ్చుకు వస్తోందని అమెరికాలోని స్టాన్‌ఫోర్డు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవలనే ఒక నివేదిక ద్వారా హెచ్చరించారు.

ఈ శతాబ్దాంతానికి ప్రపంచ డెల్టా భూముల్లో అత్యధిక భాగం సముద్రంలో కలిసిపోతుందని కూడా అంచనా వేశారు. సాధారణంగా సముద్ర మట్టాల పెరుగుదలకు భూతాపం కారణమవుతుంది. డెల్టా ప్రాంతంలో నేలకుంగి సముద్రం పాలవుతుంది. చిరకాలంగా ఎగువ ప్రాంతాల నుంచి నదులు తీసుకు వచ్చే ఒండ్రు మట్టి, డెల్టాలో కొత్త భూములు విస్తరించడానికి ఉపయోగపడుతుంది. సముద్ర మట్టాలు పెరిగినా, డెల్టా ముంపునకు గురికాకుండా రక్షిస్తుంది. కానీ దీనికి భిన్నంగా నదులకు ఎగువన భారీ ఆనకట్టలు, జలాశయాలు నిర్మిస్తుండటంతో కిందకు కొట్టుకు వచ్చే ఒండ్రుమట్టి రావడం తగ్గిపోతోంది. డెల్టా లోనూ ఆనకట్టల కరకట్టలు, లాకులు వంటివి నిర్మిస్తున్నారు. ఫలితంగా నదీ ప్రవాహాలతో వచ్చే ఒండ్రు మట్టి సువిశాలంగా పరుచుకోలేకపోతోంది. దీంతో డెల్టా పర్యావరణమే దెబ్బతిని అనేక అనర్ధాలు ఏర్పడుతున్నాయి,

ఈ ప్రభావం మడ అడవులపై పడి సుందర్‌బన్ దీవుల ఉనికి అయోమయంగా తయారవుతోంది. గృహ నిర్మాణం పేరుతో ప్రభుత్వాలు సుందర్‌బన్ దీవుల్లోని సగర్ దీవిలో మడ అడవులను కూల్చేయడంతో పర్యావరణానికి ప్రమాదం ముంచుకొస్తోంది. బంగ్లార్ అబ్బాస్ అనే పేరున పశ్చిమబెంగాల్ ప్రభుత్వం మడ అడవులను కొంత వరకు ఖాళీ చేయిస్తోంది. 2019 నవంబర్ 9న సుందర్‌బన్ దీవుల్లో బుల్‌బుల్ తుపాన్ బీభత్సం సృష్టించినా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా మడ అడవులే ప్రజలను కాపాడగలిగాయి. దీన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తెలుసుకుని మడ అడవులను మరింత విస్తరిస్తేనే రక్షణ కలుగుతుందన్న అభిప్రాయానికి వచ్చారు. తీవ్రమైన తుపాన్లు అదే పనిగా కమ్ముకుని రావడం, పెద్ద అలలు, నదీముఖ ద్వారం వద్ద తాజా నీటి ప్రవాహానికి అడ్డు ఏర్పడడం, ఇవన్నీ మడ అడవులపై వ్యతిరేక ప్రభావం చూపిస్తున్నాయి.

పెరుగుతున్న లవణీయం సుందర్‌బన్ దీవులను ప్రమాదంలో ముంచెత్తుతున్నాయి. ఈ దీవుల మడ అడవుల సంరక్షణకు ప్రత్యేక ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించినా ఆ మేరకు ఇంకా చర్యలు ప్రారంభ కాలేదు. ఉదాహరణకు బసంతి దీవికి చెందిన కొందరు తమ దీవి భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం 2023 24 బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు మడ అడవుల సంరక్షణకు ప్రత్యేక ప్రాజెక్టు చేపడతామని ప్రకటించడంతో ఈ దీవిలోని వారికి ఆశలు కలుగుతున్నాయి. బసంతి దీవికి చెందిన 50 ఏళ్ల తాజిద్దీన్ మింటు అనే అడవుల సంరక్షక వాలంటీర్ మడఅడవుల సంరక్షణకు ప్రత్యేక ప్రాజెక్టు ప్రకటించడంతో ఉబ్బితబ్బియ్యాడు. రెండు దశాబ్దాలుగా మింటు మడ అడవులను సంరక్షించే పనిలో నిమగ్నమయ్యాడు. అటవీశాఖ కూడా ఆయనకు సహాయం చేస్తోంది.

అయితే బసంతి దీవి లోని తన గ్రామం భరత్‌గర్‌ను సుందర్‌బన్ దీవులే రక్షిస్తాయని నమ్ముతున్నాడు. భారత్ లోని సుందర్‌బన్ 102 దీవుల్లో జనావాసాలైన 54 దీవుల్లో ఒక దీవిలో భరత్‌గర్ ఉంటోంది. ప్రపంచం మొత్తం మీద భారీ డెల్టా ప్రాంతం ఈ దీవుల్లోనే ఉంది. గంగా, బ్రహ్మపుత్ర, మేఘన ఈ మూడు నదుల సంగమం వల్ల ఈ డెల్టా ఏర్పడింది. దీని విస్తీర్ణం 10 వేల చదరపు కిమీ. భారత దేశ మడ అడవులు ముఖ్యంగా సుందర్‌బన్ జీవావరణం వాతావరణ మార్పులతో, మానవ కల్పిత చర్యలతో సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. తుపాన్ల తీవ్రత పెరుగుతోంది. ఫలితంగా లవణీయత మరింత పెరుగుతోంది. ఈ పరిణామాలన్నీ సుందర్‌బన్ మడ అడవులపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తున్నాయ. తీర ప్రాంత నివాసాల అభివృద్ధి కోసం కోస్తా తీరం పొడవునా మడ అడవుల పెంపకం చేపట్టడం, ప్రత్యక్ష ఆదాయం పొందడం అనే లక్షంతో కొత్త పథకాన్ని బడ్జెట్ ప్రతిపాదించింది. దీన్ని మాంగ్రోవ్ ఇనీషియేటివ్ ఫర్ షోర్‌లైన్ హేబిటేట్స్, అండ్ టాంజిబుల్ ఇంకమ్స్ (ఎంఐఎస్‌హెచ్‌టిఐ) అనే పథకాన్ని ప్రకటించారు.

తమ మడవుల మొక్కల పెంపకానికి ఈ పథకం ప్రేరణ కాగలదని దీవుల ప్రజలు అభిప్రాయం వెలిబుచ్చారు. దీవులకు రక్షణ కవచాలు ఏర్పడడమే కాకుం డా కలపకు వనరులుగా, వంటచెరకు, తేనె, మైనం, ఆల్కహాలు, ఓషధుల వనరులు, మూలికల వనాలు ఏర్పడతాయని ఆశిస్తున్నారు. కానీ తీవ్రమైన తుపాన్ల పరంపర తరచుగా సంభవించడం, అలలు ఉవ్వెత్తున లేవడం, నదుల నుంచి వచ్చే ప్రవాహం సముద్రంలో కలియనీయకుండా ముఖద్వారం వద్ద అడ్డుకట్టలు వేయడం వంటి మానవ చర్యలు లవణీయత పెరిగిపోతుండడానికి దారి తీస్తున్నాయి. సముద్ర జలాల్లో నివసించే మత్సజాతి ఉనికి దెబ్బతిని చివరకు అవి అంతరించిపోడానికి దారి తీస్తోంది. హెరిటైరా ఫోమెస్ (సుందరి ట్రీ) వంటి మంచినీటి మడ అడవుల్లో లవణీయత ప్రభావం కనిపిస్తోంది. ఈ మంచినీటి మడ అడవులు అంతరించిపోయే జాబితాలో ఉన్నాయి. మరో మంచినీటి మడ అడవుల తెగ నైపాఫ్రుటికాన్స్ కూడా అంతరించే జాబితాలో ఉంది. సుందరి, గోల్పాట దీవుల భూముల సాంద్రత వేగంగా క్షీణిస్తోందని క్షేత్రస్థాయి అధ్యయనంలో తేలిందని పశ్చిమ బెంగాల్ ఫారెస్ట్ కన్సర్వేటర్, సందర్‌బన్స్ బయోస్ఫియర్ రిజర్వు జాయింట్ డైరెక్టర్ అజోయ్ కుమార్ దాస్ పేర్కొన్నారు.

లవణీయతను తట్టుకునే అవిసెన్నా ఆల్బా వంటి విభిన్నమైన మడ అడవుల చెట్లు వేగంగా విస్తరిస్తున్నాయి. దీని వల్ల మడ అడవుల తోపుల్లో మార్పు కనిపిస్తోందని చెప్పారు. గంగా, బ్రహ్మపుత్ర వంటి నదుల ప్రవాహాలు సరిగ్గా సాగక ఈ రీజియన్‌లో లవణీయత బాగా పెరిగిపోతోందని చెప్పారు. ఇటీవల కాలంలో అలియా, యాంఫన్, యాస్, బుల్‌బుల్ వంటి తీవ్రమైన తుఫాన్లు తరచుగా సంభవిస్తుండటంతో సముద్రం అలలు ఉవ్వెత్తున పెరుగుతున్నాయి. వరదలకు దారి తీస్తున్నాయి. దీంతో నేలసారం అంతా లవణీయతమయమై సాగు చేయడానికి పనికి రానివిగా భూము లు మారిపోతున్నాయి. ఇంతేకాక సముద్ర జలాలు భూగర్భ జలాల్లోకి ప్రవేశిస్తుండటంతో సామాజిక, ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. వ్యవసాయ భూములు లవణీకరణకు గురి కావడం, భూగర్భ జలాలు ఉప్పు నీటి మయం కావడంతో పంటలు పండించుకోలేక, కనీసం బతకడానికైనా తిండి గింజలు సంపాదించుకోలేక ఈ దీవుల నుంచి జనం భారీ ఎత్తున వేరే నగరాలకు వలసలు పోయే ప్రమాదం ఏర్పడుతోంది. పశ్చిమ బెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ యానిమల్ అండ్ ఫిషరీ సైన్సెస్ సమగ్ర అధ్యయనంలో భారత ఉపఖండం లోని మిగతా ప్రాంతాల కన్నా సుందర్‌బన్స్ రీజియన్‌లో సముద్ర నీటి మట్టాలు విపరీతంగా పెరుగుతున్నాయని తేలింది.

ఫలితంగా తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. దీవులు వేగంగా మునిగిపోతున్నాయి. 2002 2009 మధ్యకాలంలో సేకరించిన సాగర్ దీవికి సంబంధించిన డేటా బట్టి సాగర్ దీవి వద్ద సముద్ర నీటి మట్టాలు దశాబ్ద కాలంలో ఏడాదికి 12 ఎంఎం వరకు పెరుగుతుండగా, మిగతా తీర ప్రాంతాల్లో ఏడాదికి 2.5 ఎంఎం వరకు నీటి మట్టాలు పెరగడం జరుగుతోందని అధ్యయనంలో తేలిందని నివేదిక రూపకర్త ఆర్‌కె త్రివేది చెప్పారు. సముద్ర మట్టాల పెరుగుదలను అరికట్టడానికి మడ అడవుల పెంపకంలో పరిమితి కనిపిస్తోంది. ఉదాహరణకు భాంగధుని, బుల్చేరి, డల్హౌసీ వంటి దీవులు మడ అడవులను, టైగర్ రిజర్వులను రక్షిస్తున్నాయి. కానీ సగానికి సగం దీవులు సముద్రంలో మునిగిపోతున్నాయి. అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గత మూడు దశాబ్దాలుగా మడ అడవుల పెంపకం విస్తీర్ణాన్ని 85 చదరపు కిలోమీటర్ల వరకు పెంచింది. ఎంతయినా పరిమితికి లోబడి పనులు జరుగుతున్నాయి. కానీ హిమానీ నదాలు కరిగి పోకుండా కార్బన్ డైయాక్సైడ్ వాయువులు వెలువడకుండా ప్రపంచ స్థాయిలో తగిన చర్యలు అవసరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈలోగా భారత్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు సుందర్‌బన్ దీవుల రక్షణ కోసం డెల్టాలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మడ అడవుల మొక్కలను పెంచినంత మాత్రాన సముద్ర మట్టాల పెరుగుదల, లవణీయత సమస్యలు పరిష్కారం కావు. మొత్తం డెల్టా పర్యావరణ జీవావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం అవసరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నదుల నుంచి దీవులకు తాజాగా నీరు ప్రవహించేలా, అవి తీసుకు వచ్చే ఒండ్రు మట్టి డెల్టాలో చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని కోరుతున్నారు.

పి.వెంకటేశం
9985725591

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News