మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ గురువారం ఎన్‌సిపి అభ్యర్థిగా రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేయడం పట్ల తనకు ఆసక్తి ఉన్నప్పటికీ సునేత్ర పవార్ నామినేషన్ పట్ల తాను అసంతృప్తిగా లేనని ఎన్‌సిపి సీనియర్ నాయకుడు, రాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ అన్నారు. సునేత్ర పవార్ ఎంపిక సమిష్టి నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మహారాష్ట్రలోని బారామతి నియోజవకవర్గం నుంచి ఎన్‌సిపి అభ్యర్థిగా పోటీ చేసిన సునేత్ర పవార్ తన మరదలు, ఎన్‌సిపి(శరద్ పవార్) అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె చేతిలో ఓటమి చెందారు. రాజ్యసభ ఎన్నికలలో సునేత్ర పవార్‌ను నిలపాలని పార్టీ నిర్ణయించిందని,
తాను కూడా పోటీ చేయడం పట్ల ఆసక్తిగా ఉన్నానని, కాని బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు ఆమె పేరును ఖరారు చేశారని ఛగన్ భుజ్‌బల్ విలేకరులకు తెలిపారు. 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలను రాజ్యసభ సచివాలయం ఇటీవలే ప్రకటించింది. వీటిలో అస్సాం, బీహార్, మహారాష్ట్రలో రెండేసి, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపురలో ఒకటి చొప్పున ఉన్నాయి. కీలక పదవులన్నీ ఒకే కుటుంబానికి వెళుతున్నాయా అని విలేకరులు ప్రశ్నించగా సునేత్ర పేరును అజిత్ పవార్ నిర్ణయించలేదని భుజ్‌బల్ తెలిపారు. మహారాష్ట్ర నుంచి లోక్‌సభ సభ్యులుగా పియూష్ గోయల్, ఉదయన్‌రాజె భోంస్తే ఎన్నికవ్వడంతో రాజ్యసభలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి.