ముంబై: టీమిండియా యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లపై భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునిల్ గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. కిందటి ఐపిఎల్‌లో రాణించడం ద్వారా ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లు టీమిండియాలో చోటు సంపాదించారన్నాడు. ఐపిఎల్ ప్రతిభ వల్ల వీరిద్దరూ స్వల్ప వ్యవధిలోనే జాతీయ జట్టుకు ఎంపికయ్యే స్థాయికి చేరుకున్నారన్నాడు. తాజాగా వరల్డ్‌కప్‌కు కూడా ఎంపిక కావడంతో ఇద్దరు బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడం లేదని విమర్శించాడు. ఐపిఎల్‌లో ఇద్దరు కూడా పేలవమైన ఆటతో సతమతమవడం తనను ఎంతో బాధకు గురి చేస్తుందన్నాడు. గతంలో కూడా ఐపిఎల్‌లో రాణించిన చాలా మంది యువ ఆటగాళ్లు స్వల్ప వ్యవధిలోనే టీమిండియాలో చోటు సంపాదించారని, అయితే ఆ తర్వాత ఆటపై నిర్లక్ష్యం వహించి పత్తా లేకుండా పోయారన్నాడు. ప్రస్తుతం ఇషాన్, సూర్యలకు ఇదే పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యం లేదన్నాడు. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడంతో ఇద్దరు బ్యాటింగ్‌పై నిర్లక్ష్యం కనబరుస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా, రానున్న మ్యాచుల్లో వీరి ఆట తీరు గాడిలో పడకపోతే వరల్డ్‌కప్ దూరం కావడం ఖాయమని జోస్యం చెప్పాడు.
Sunil Gavaskar about Suryakumar and Ishan Kishan