ముంబై: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అండగా నిలిచాడు. ఇటీవల కాలంలో కోహ్లి వరుస వైఫల్యాలు చవిచూస్తున్న విషయం తెలిసిందే. దీంతో కోహ్లిపై భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, వెంకశ్ ప్రసాద్ తదితరులు తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. వరుసగా విఫలమవుతున్నా కోహ్లికి తుది జట్టులో చోటు కల్పించడాన్ని వీరు తప్పుపట్టారు. భారత క్రికెట్‌లో ఎందరో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని, వారిని కాదని పెద్ద ఆటగాడనే పేరుతో కోహ్లిని ఆడించడం తగదని వారు పేర్కొన్నారు. ఇదిలావుండగా వీరి విమర్శలను గవాస్కర్ తిప్పికొట్టాడు. కోహ్లిలాంటి దిగ్గజ క్రికెటర్‌ని తక్కువ చేసి చూడడం సరికాదన్నాడు.
భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ఘనత విరాట్‌కు మాత్రమే దక్కుతుందన్నాడు. ఫామ్ తాత్కాలికం. ఆటగాడి నాణ్యత శాశ్వతం అని గవాస్కర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌పై కోహ్లి దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడని, ఆ క్రమంలోనే అతను త్వరగా పెవిలియన్ చేరిన విషయాన్ని గమనించాలన్నాడు. కొన్నిసార్లు ధాటిగా ఆడాలనే తొందరలో వికెట్‌ను పారేసు కోవడం పరిపాటన్నాడు. కోహ్లి కూడా ఇంగ్లండ్ సిరీస్‌లో ఇలాగే ఔటయ్యాడన్నాడు. గతంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వరుస వైఫల్యాలు చవిచూశాడని, అయితే అతన్ని తొలగించాలని ఎవరూ సూచించలేదన్నాడు. కోహ్లి విషయంలోనే ఇలా ఎందుకు స్పందిస్తున్నారో తనకు అంతుబట్టడం లేదన్నాడు. ఇక కోహ్లిని ఆడించాలా వద్దా అనేది నిర్ణయించేది సెలెక్టర్లేనని, మిగతావారు ఈ విషయంలో తలదూర్చడం సరికాదని గవాస్కర్ హితవు పలికాడు.
Sunil Gavaskar Support to Kohli for his Form