Thursday, January 23, 2025

సిద్దరామయ్య ముఖ్య సలహాదారుగా సునీల్ కనుగోలు నియామకం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు పనిచేసిన ఆ పార్టీ ఎన్నికల ప్రచార వ్యూహకర్త సునీల్ కనుగోలు ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఆయనకు ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పించనున్నది.

2022లో కాంగ్రెస్ ప్రచార వ్యూహానికి అధిపతిగాచేరిన సునీల్ 2024 టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా కూడా నియమితులయ్యారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కోసం సర్వేలు నిర్వహించడం, ప్రచార వ్యూహాలను రచించడం వంటి ప్రణాళికలతో కాంగ్రెస్ పార్టీని విజయ తీరానికి చేర్చడంలో సునీల్ కీలక పాత్ర పోషించడం, గతంలో అనేక రాజకీయ పార్టీలతో, నాయకులతో పనిచేసినప్పటికీ 2022లో కాంగ్రెస్‌లో చేరి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు.

కర్నాటకలో ఆయన సారథ్యంలోని మైండ్‌షేర్ అనాలిటిక్స్‌కు చెందిన ఆయన బృందం బిజెపి ముఖ్యమంత్రి ఎస్‌ఆర్ బొమ్మైకు, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేసిఎం, 40 శాతం సర్కార వంటి ప్రచారాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఎన్నికలు సమీపించే వరకు ఆయన బృందం రాష్ట్రవ్యాప్తంగా ఐదు సార్లు సర్వేలను నిర్వహించినట్లు తెలుస్తోంది. స్వల్ప ఓట్ల తేడాతో కాంగ్రెస్ దెబ్బతినడానికి అవకాశం ఉన్న నియోజకవర్గాలపై పార్టీ నాయకత్వాన్ని అప్రమత్తం చేసి దిద్దుబాటు చర్యలు సకాలంలో చేపట్టడంలో సునీల్ పాత్ర కీలకమని తెలుస్తోంది.

కర్నాటక కాంగ్రెస్‌తో పనిచేయడానికి ముందు సునీల్ ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, తెలంగాణతోసహా అర డజనుకు పైగా రాష్ట్రాలలో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు.

2014లో ప్రధాని నరేంద్ర మోడీ కోసంలోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ కిశోర్‌తో కలసి పనిచేసిన సునీల్ కనుగోలు తెరవెనుక మంత్రాంగానికే పరిమితమయ్యారు తప్ప ఏనాడూ తెరముందుకు రాలేదు. డిఎంకె, ఐఎఎడిఎంకె, కాంగ్రెస్‌తోసహా వివిధ రాజకీయ పార్టీలకు ఆయన ప్రచార వ్యూహకర్తగా పనిచేశారు. కర్నాటకలోని బళ్లారి జిల్లా వాస్తవ్యుడైన సునీల్ మాతృభాష తెలుగు. ఆయన అనేక సంవత్సరాలు చెన్నైలో నివసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News