Sunday, December 22, 2024

అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్‌కు అనారోగ్యం

- Advertisement -
- Advertisement -

స్టార్‌లైనర్‌లో తలెత్తిన సమస్యల వల్ల అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇద్దరు నాసా వ్యోమగాముల్లో సునీతా విలియమ్స్‌అనారోగ్యానికి గురైనట్టు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అందులో సునీతా విలియమ్స్ బరువు తగ్గినట్టుగా , బుగ్గలు లోపలికి వెళ్లినట్టుగా కనిపిస్తున్నారు. ఆమెపోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లే బలహీనంగా కనిపిస్తున్నారని అమెరికాకు చెందిన శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ వినయ్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. అంతరిక్షంలో ఉన్నవారికి స్పేస్ ఎనీమియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. స్పేస్‌లో ఉన్నప్పుడు వ్యోమగాముల్లో ఎర్రకణాలు క్షీణించే స్థితినే స్పేస్ ఎనీమియా అంటారు.

‘ మైక్రో గ్రావిటీ’కి ఎక్కువ కాలం గురైనప్పుడు ఎర్రరక్త కణాల ఉత్పత్తితో పోలిస్తే అవి క్షీణించే రేటు వేగంగా ఉంటుంది. ఒక వ్యోమగామి అంతరిక్షం లోకి ప్రవేశించిన వెంటనే శరీరం స్పేస్ ఎనీమియాకు గురవడం మొదలవుతుందని నాసా నివేదిక చెబుతోంది. ఎర్రరక్త కణాలను నాశనం చేయడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. దాంతో అలసట, నిస్సత్తువ, శారీరక, మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించొచ్చు. అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశమూ ఉంది. 8 రోజుల మిషన్‌లో భాగంగా వ్యోమగాములు సునీత , విల్‌మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉండగా, వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోనే ఉండనున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News