Tuesday, March 18, 2025

సునీతా విలియమ్స్ తిరుగుప్రయాణం… ప్రధాని మోడీ లేఖ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ కొన్ని నెలల ఎదురుచూపుల తరువాత భూమిపైకి తిరిగి వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్పందించారు. “ మిమ్మల్ని భారత్‌లో చూసేందుకు ఎదురుచూస్తున్నాం ” అని సునీతకు లేఖ రాశారు. ఆమె సురక్షితంగా భూమిపైకి తిరిగి రావాలని , ఆరోగ్యంగా ఉండాలని, మోడీ ఆకాంక్షించారు. సునీత సాధించిన విజయాల పట్ల 140 కోట్ల మంది భారతీయులు గర్వంగా ఉన్నారని పేర్కొన్నారు. “ యూఎస్ పర్యటనకు వెళ్లినప్పుడు , మీ గురించి అడిగి తెలుసుకున్నాను. మీరు వేలాది కి.మీ దూరంలో ఉన్నప్పటికీ, మా హృదయాలకు దగ్గరగా ఉన్నారు. మీ అంతరిక్ష యాత్ర విజయం సాధించాలని మేమంతా కోరుకుంటున్నాం.

మీరు తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని భారత్‌లో చూసేందుకు ఎదురు చూస్తున్నాం. తన కుమార్తెలకు ఆతిథ్యం ఇవ్వడం పట్ల భారత్ సంతోషంగా ఉంటుంది” అని మోడీ తన లేఖలో పేర్కొన్నారు. మార్చి ఒకటిన రాసిన లేఖను కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ లేఖ పట్ల సునీత సంతోషం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సునీతా విలియమ్స్, వ్యోమగామి బుచ్ విల్మోర్ , మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి వారు బుధవారం తెల్లవారు జామున 3.27 గంటలకు ( భారత కాలమానం ప్రకారం )పుడమికి చేరుకుంటారని అమెరికా అంతరిక్షసంస్థ నాసా ప్రకటించిన విషయం తెలిసిందే. 2024 జూన్ 5 న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్‌లైనర్‌లో సునీత , విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. వారం రోజులకే తిరిగి భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుకుపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News