Friday, January 3, 2025

శ్వేత సౌధంలో దీపావళి..అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ వీడియో సందేశం

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు జో బైదెన్ సోమవారం శ్వేత సౌధంలో దీపావళి ఉత్సవాన్ని నిర్వహించారు. అమెరికా వ్యాప్తంగా కాంగ్రెస్ సభ్యులు, అధికారులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు సహా 600 మందికి పైగా భారతీయ అమెరికన్లు ఆ ఉత్సవానికి హాజరయ్యారు. వైట్ హౌస్ ఈస్ట్ రూమ్‌లో బైడెన్ ప్రసంగిస్తూ, ‘అధ్యక్షునిగా వైట్ హౌస్‌లో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో దీపావళి వేడుకకు ఆతిథ్యం ఇస్తుండడం గౌరవంగా భావిస్తున్నాను. నాకు ఇది పెద్ద కార్యక్రమం. సెనెటర్‌గా, ఉపాధ్యక్షునిగా, అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించా. నా సిబ్బందిలో దక్షిణ ఆసియా అమెరికన్లు కీలక సభ్యులుగా ఉన్నారు. కమల నుంచి డాక్టర్ మూర్తి వరకు అనేక మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. అమెరికా వలె కనిపించే ఒక పాలక యంత్రాంగాన్ని కలిగి ఉండాలన్న నా నిబద్ధతను పాటించినందుకు గర్విస్తున్నా’ అని చెప్పారు.

బైడెన్ అధ్యక్షుని హోదాలో నిరుడు వైట్ హౌస్‌లో దీపావళి ఉత్సవానికి ఆతిథ్యం ఇచ్చారు. వచ్చే వారం జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ పోటీ చేయడం లేదు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రథమ పౌరురాలు డాక్టర్ జిల్ బైడెన్ ప్రచార కార్యక్రమాల్లో ఉన్నందున ఈ ఉత్సవానికి హాజరు కాలేదు. బైడెన్‌కు ముందు యుఎస్ సర్జన్ జనరల్ వైస్ అడ్మిరల్ వివేక్ హెచ్ మూర్తి, విశ్రాంత నౌకాదళ అధికారి, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, భారతీయ అమెరికన్ యువజన కార్యకర్త శ్రుష్టి అముల ప్రసంగించారు. అముల అధ్యక్షుని పరిచయం చేశారు. సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి రికార్డు చేసిన వీడియో సందేశం పంపారు. వైట్ హౌస్ బ్లూ రూమ్‌లో బైడెన్ లాంఛనంగా ఒక ప్రమిద వెలిగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News