Tuesday, March 18, 2025

భారీ ఆశలతో సన్‌రైజర్స్..

- Advertisement -
- Advertisement -

టైటిల్‌పై హైదరాబాద్ కన్ను!
మన తెలంగాణ/ హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 18కు త్వరలో తెరలేవనున్న సంగతి తెలిసిందే. మార్చి 22 నుంచి మే 25 వరకు జరిగే ఈ మెగా టోర్నమెంట్‌లో పది జట్లు బరిలో దిగుతున్నాయి. కిందటి సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు పాట్ కమిన్స్ కెప్టెన్సీలో హైదరాబాద్ తనఅదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సన్‌రైజర్స్ సమతూకంగా ఉంది. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు.

కిందటి సీజన్‌లో పరుగుల సునామీ సృష్టించిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డిలపై ఈసారి కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఓపెనర్లు అభిషేక్, ట్రావిస్ హెడ్‌లు కిందటి సారి విధ్వంసక బ్యాటింగ్‌తో పెను ప్రకంపనలు సృష్టించారు. అసాధారణ బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులను తిరగరాశారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వీరికి తోడుగా ఇషాన్ కిషన్ వంటి మరో విధ్వంసక బ్యాటర్ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. మెగా వేలం పాటలో భారీ మొత్తం ధరకు ఇషాన్‌ను సన్‌రైజర్స్ సొంతం చేసుకుంది. ట్రావిస్, అభిషేక్, క్లాసెన్, ఇషాన్, నితీశ్ రెడ్డిలతో హైదరాబాద్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక పాట్ కమిన్స్ నేతృత్వంలోని బౌలింగ్ కూడా బాగానే ఉంది.

రెండు విబాగాల్లో సమతూకంగా ఉన్న సన్‌రైజర్స్ ట్రోఫీపై కన్నేసింది. కమిన్స్ నాయకత్వం ప్రతిభకు యువ ఆటగాళ్ల సహకారం తోడైతే హైదరాబాద్ ఐపిఎల్ ట్రోఫీని సాధించడం ఖాయం. హైదరాబాద్ ఆటగాళ్లు ఇప్పటికే సాధన ప్రారంభించారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తదితరులు నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆటగాళ్లు సాధనలో నిమగ్నమయ్యారు. జట్టు సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతున్నారు. ప్రధానకోచ్ డానియల్ వెటోరి పర్యవేక్షణలో ఆటగాళ్లు సాధన చేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగ్గా ఉన్న హైదరాబాద్‌ను ఐపిఎల్ ఫేవరెట్‌లలో ఒకటిగా పరిగణిస్తున్నారు. విధ్వంసక బ్యాటర్లు కలిగిన సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో పెను ప్రకంపనలు సృష్టించడం ఖాయమని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News