ఐపిఎల్‌లోని అసలైన మజాను పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అభిమానులకు అందించాయి. శనివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో పరుగుల వరద పారింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. పంజాబ్ బౌలింగ్‌ను ఊచకోత కోసిన అభిషేక్ 55 బంతుల్లోనే 10 భారీ సిక్స్‌లు, మరో 14 ఫోర్లతో 141 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (66)తో కలిసి తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 171 పరుగులు జోడించాడు. మిగిలిన లాంఛనాన్ని క్లాసెన్ 21 (నాటౌట్), ఇషాన్ 9 (నాటౌట్) పూర్తి చేశారు.
పరుగుల వరద..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కళ్లు చెదిరే శుభరంభాన్ని అందించారు. కిందటి మ్యాచ్‌లో శతకంతో కదం తొక్కిన ప్రియాంశ్ ఈసారి కూడా దూకుడును ప్రదర్శించాడు. 13 బంతుల్లోనే 4 సిక్స్‌లు, రెండు ఫోర్లతో 36 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 23 బంతుల్లో 7 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 42 పరుగులు సాధించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న శ్రేయస్ 36 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, 6 ఫోర్లతో 82 పరుగులు చేశాడు. నెహాల్ వధెరా (27) కూడా తనవంతు పాత్ర పోషించాడు. దీంతో పంజాబ్ స్కోరు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 245 పరుగులకు చేరింది.