Friday, November 15, 2024

నిరాశే మిగిలింది..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఐపిఎల్ సీజన్16లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. కిందటి సీజన్‌లో ఏడో స్థానంతో సంతృప్తి పడిన సన్‌రైజర్స్ ఈసారి అట్టడుగు స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించింది. దీంతో 8 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. ఇంటాబయటా అనే తేడా లేకుండా సన్‌రైజర్స్ వరుస ఓటములు చవిచూసింది. ఒకప్పుడూ ఐపిఎల్‌లో బరిలోకి దిగిందంటే కనీసం ప్లేఆఫ్ బెర్త్ ఖాయం చేసుకునేది సన్‌రైజర్స్. అలాంటి జట్టు కొన్ని సీజన్‌ల నుంచి అత్యంత పేలవమైన ఆటతో సతమతమవుతోంది. ఈ ఏడాది మరింత చెత్త ఆటను కనబరిచింది. స్వల్ప లక్ష్యాలను సయితం ఛేదించలేక వరుస పరాజయాలను మూట గట్టుకుంది. జట్టును ముందుండి నడిపించడంలో ఐడెన్ మార్‌క్రమ్ పూర్తిగా తేలిపోయాడు. అతని పేలవమైన కెప్టెన్సీ సన్‌రైజర్స్ చెత్త ప్రదర్శనకు ప్రధాన కారణంగా చెప్పాలి.

హార్దిక్ పాండ్య, లోకేశ్ రాహుల్, సంజు శాంసన్, కృనాల్ పాండ్య, నితీష్ రాణా, డుప్లెసిస్, ధోనీ తదితరులు అద్భుత కెప్టెన్సీతో తమ తమ జట్లను విజయపథంలో నడిపించగా మార్‌క్రమ్ మాత్రం ఇందులో పూర్తిగా విఫలమయ్యాడు. ఇటు సారథిగా అటు బ్యాటర్‌గా మార్‌క్రమ్ రాణించలేక పోయాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపించింది. ఇక మినీ వేలం పాటలో కోట్లాది రూపాయలు వెచ్చించి సొంతం చేసుకున్న ఇంగ్లండ్ సంచలనం హ్యారీ బ్రూక్ ఘోర వైఫల్యం చవిచూశాడు. ఈ సీజన్‌లో బ్రూక్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో రాణించాడు. అది కూడా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కాడు. అది తప్ప మిగతా అన్ని మ్యాచుల్లోనూ బ్రూక్ విఫలమయ్యాడు. ఇక కిందటి సీజన్‌లో పరుగుల వరద పారించిన రాహుల్ త్రిపాఠి ఈసారి ఆ స్థాయి బ్యాటింగ్‌ను కనబరచలేక పోయాడు. ఒకటి రెండు మ్యాచుల్లో తప్పిస్తే రాహుల్ పెద్దగా బ్యాట్‌ను ఝులిపించలేక పోయాడు. భారీ ఆశలు పెట్టుకున్న త్రిపాఠి తేలిపోవడం కూడా హైదరాబాద్ వైఫల్యానికి ఒక కారణంగా చెప్పాలి.

అంతేగాక మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ తదితరులు కూడా నిరాశ పరిచారు. జట్టును ఆదుకోవడంలో వీరంతా విఫలమయ్యారు. బౌలింగ్‌లో కూడా భువనేశ్వర్ ఒక్కడే కాస్త రాణించాడు. ఇతర బౌలర్లు విఫలం కావడంతో జట్టుకు ఇబ్బందులు తప్పలేదు. ఈ సీజన్‌లో కనీసం ప్లేఆఫ్‌కు చేరుకోవడం ఖాయమని భావించిన సన్‌రైజర్స్ చెత్త ప్రదర్శనతో అట్టడుగు స్థానంలో నిలిచి అభిమానులను, జట్టు యాజమాన్యాన్ని నిరాశకు గురి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News