Wednesday, March 26, 2025

జోరు తగ్గని సన్‌రైజర్స్

- Advertisement -
- Advertisement -
  • తొలి మ్యాచ్‌లోనే పరుగుల సునామీ

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్18 తొలి మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. కిందటి సీజన్ మాదిరిగానే ఈసారి కూడా పరుగుల వరద పారించారు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 286 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు జట్టుకు కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించారు. అభిషేక్ 11 బంతుల్లోనే 24 పరుగులు చేశాడు. ఇక ట్రావిస్ 31 బంతుల్లోనే 67 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కిందటి సీజన్‌లో కూడా వీరు విధ్వంసక బ్యాటింగ్‌తో పెను ప్రకంపనలు సృష్టించారు. తాజా సీజన్ తొలి మ్యాచ్‌లోనే చెలరేగి ఆడి ప్రత్యర్థి టీమ్ బౌలర్లకు హెచ్చరిక జారీ చేశారు. రానున్న మ్యాచుల్లో వీరిని కట్టడి చేయడం ప్రత్యర్థి జట్ల బౌలర్లకు కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇషాన్ ముద్ర..

మరోవైపు టీమిండియా యువ సంచలంన ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే విధ్వంసక సెంచరీతో అలరించాడు. గతంలో ముంబై తరఫున ఆడిన ఇషాన్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. మెగా వేలం పాటలో ఏకంగా రూ.15.50 కోట్లను వెచ్చించి ఇషాన్‌ను దక్కించుకుంది. సన్‌రైజర్స్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సరైందేనని ఇషాన్ తొలి మ్యాచ్‌లోనే నిరూపించాడు. అరంగేట్రం పోరులోనే విధ్వంసక సెంచరీతో చెలరేగి పోయాడు. ఈ ఇన్నింగ్స్‌తో తాను ఎంత ప్రమాదకర బ్యాట్‌మన్ అనేది ప్రత్యర్థి టీమ్ బౌలర్లకు చాటాడు. అతన్ని కట్టడి చేసేందుకు రాజస్థాన్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలి బంతి నుంచే ఇషాన్ తన మార్క్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో కనువిందు చేశాడు. రానున్న మ్యాచుల్లో కూడా ఇషాన్ ఇలాగే చెలరేగితే హైదరాబాద్‌కు ఎదురే ఉండదు. ఇక క్లాసెన్, నితీశ్ రెడ్డిలు కూడా దూకుడైన బ్యాటింగ్‌తో అలరించారు. కిందటి సీజన్‌లో ఈ ఇద్దరు అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచారు. ఈసారి కూడా తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటారు. ఇంతకుముందు అభిషేక్, హెడ్, క్లాసెన్, నితీశ్‌ల రూపంలో విధ్వంసక బ్యాటర్లు ఉండగా తాజాగా వీరి సరసన ఇషాన్ కిషన్ చేరాడు. ప్రస్తుతం ఐపిఎల్‌లో ఆడుతున్న ఏ జట్లులోనూ ఇంత మంది విధ్వంసక బ్యాటర్లు లేరు. దీంతో రానున్న మ్యాచుల్లో సన్‌రైజర్స్ బ్యాటర్లను ఆపడం ప్రత్యర్థి టీమ్ బౌలర్లకు చాలా కష్టమనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News