Friday, December 20, 2024

సన్‌రైజర్స్‌కు సవాల్

- Advertisement -
- Advertisement -

నేడు ఉప్పల్‌లో సిఎస్‌కెతో పోరు

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)తో జరిగే మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సవాల్‌గా మారింది. గుజరాత్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో హైదరాబాద్ పరాజయం చవిచూసింది. చెన్నై కూడా తన చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ పరిస్థితుల్లో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకమేనని చెప్పాలి. ఇక ఇంతకుముందు ఉప్పల్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరుగుల సునామీ సృష్టించింది. ఆ మ్యాచ్‌లో ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును సన్‌రైజర్స్ నమోదు చేసింది.

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్‌క్రమ్ తదితరులు ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయారు. ఈసారి కూడా సన్‌రైజర్స్ బ్యాటర్లు పరుగుల వరద పారించాలనే లక్షంతో పోరుకు సిద్ధమయ్యారు. అయితే గుజరాత్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. ఒక్క బ్యాటర్ కూడా అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకోలేక పోయాడు. ఇలాంటి స్థితిలో ఈ మ్యాచ్‌లో వీరు ఎలా బ్యాట్ చేస్తారనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లకు హైదరాబాద్‌లో కొదవలేదు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తప్ప మిగతా బ్యాటర్లు మెరుగైన బ్యాటింగే కనబరుస్తున్నారు.

ముఖ్యంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్, మార్‌క్రమ్‌లపై జట్టు భారీ ఆశలు పట్టుకుంది. క్లాసెన్ విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తున్నాగు. ఈ మ్యాచ్‌లో కూడా అతనే జట్టుకు కీలకంగా మారాడు. క్లాసెన్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితో చెన్నై బౌలర్లకు ఇబ్బందులు ఖాయమనే చెప్పాలి. అభిషేక్ శర్మ, హెడ్‌లు కూడా దూకుడుగా ఆడేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరూ ఇప్పటికే సన్‌రైజర్స్ తరఫున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీలను నమోదు చేసిన బ్యాటర్లుగా రికార్డులు సృష్టించారు.

తాజాగా ఉప్పల్‌లో చెన్నైతో జరిగే మ్యాచ్‌లో కూడా పరుగుల విధ్వంసం సృష్టించాలనే పట్టుదలతో ఉన్నారు. షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, కెప్టెన్ కమిన్స్ తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. దీంతో పాటు భువనేశ్వర్ కుమార్, కమిన్స్, షాబాజ్, సుందర్, మర్కాండేలతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుండడంతో హైదరాబాద్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
విజయమే లక్షంగా..
మరోవైపు చెన్నై టీమ్‌కు కూడా ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్రలు జోరుమీదున్నారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తప్పించి మిగతా మ్యాచుల్లో వీరు శుభారంభం అందించారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కిందటి మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్ అజింక్య రహానె కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడం జట్టుకు సానుకూలం అంశంగా చెప్పాలి. డారిల్ మిఛెల్, శివమ్ దూబెల రూపంలో విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. 16 బంతుల్లోనే అజేయంగా 37 పరుగులు చేశాడు. ఇది కూడా చెన్నైకి కలిసి వచ్చే అంశమే. మరోవైపు తుషార్ దేశ్‌పాండే, జడేజా, ముస్తఫిజుర్, మతీషా పతిరణ తదితరులతో చెన్నై బౌలింగ్ కూడా బలంగానే ఉంది. రెండు విభాగాల్లో పటిష్టంగా ఉన్న చెన్నైకి కూడా గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News