Saturday, November 23, 2024

హైదరాబాద్‌కు చావో రేవో?

- Advertisement -
- Advertisement -

Sunrisers Hyderabad will play Punjab Kings on Saturday

రేపు పంజాబ్‌తో కీలక పోరు

షార్జా: వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్ చావోరేవో మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై ఆడే ఆరు మ్యాచుల్లోనూ గెలవాల్సిన పరిస్థితి సన్‌రైజర్స్‌కు నెలకొంది. ఇక రాజస్థాన్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో చేజేతులా ఓటమి పాలైన పంజాబ్‌కు కూడా ఈ పోరు కీలకంగా మారింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్‌ను శాసించిన పంజాబ్ అనూహ్య ఓటమిని చవిచూసింది. అయితే హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్‌తో పోల్చితే పంజాబ్ చాలా బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాహుల్ చాలా బలంగా ఉంది. రాజస్థాన్ కిందటి మ్యాచ్‌లో ఉంచి భారీ లక్ష్యాన్ని సయితం దాదాపు ఛేదించినంత పని చేసింది. ఆఖరి ఓవర్‌లో కార్తీక్ అసాధారణ బౌలింగ్ వల్ల ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ఇక హైదరాబాద్ మాత్రం కిందటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. బ్యాటింగ్ బౌలింగ్‌లో పేలవమైన ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్ మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.

వార్నర్ రాణించాల్సిందే..

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. జట్టు భారీ స్కోరు సాధించాలంటే వార్నర్ తన బ్యాట్‌కు పని చెప్పక తప్పదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వార్నర్ విజృంభిస్తే మెరుగైన స్కోరును సాధించడం హైదరాబాద్‌కు కష్టమేమీ కాదు. అయితే వరుస వైఫల్యాలు వార్నర్‌ను వెంటాడుతున్నాయి. దాని నుంచి బయటపడి మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేయాల్సిన అవసరం వార్నర్‌పై ఎంతైనా ఉంది. మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా కూడా బ్యాట్‌ను ఝలిపించక తప్పదు. వీరిద్దరూ మెరుగైన ఆరంభాన్ని అందిస్తే తర్వాత వచ్చే బ్యాట్స్‌మన్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడే అవకాశం ఉంటుంది. ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్, సీనియర్ ఆటగాడు మనీష్ పాండేలు కూడా జట్టుకు అండగా నిలువాలి. కిందటి మ్యాచ్‌లో ఇద్దరు విఫలమయ్యారు. జేసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, కేదార్ జాదవ్ తదితరులు కూడా తమవంతు పాత్ర పోషించాలి. అంతేగాక తొలి మ్యాచ్‌లో బౌలర్లు కూడా అంతంత మాత్రం ప్రదర్శనతో నిరాశ పరిచారు. ఈసారి బౌలర్లు కూడా మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ విభాగాల్లో మెరుగైన ప్రతిభను కనబరిస్తేనే విలియమ్సన్ సేన గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. ఒక వేళ ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం హైదరాబాద్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టక తప్పదు.

గెలుపే లక్ష్యంగా..

మరోవైపు పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో గెలుపే లక్షంగా పెట్టుకుంది. రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైన రాహుల్ సేన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలువాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పంజాబ్ సమతూకంగా కనిపిస్తోంది. మయాంక్ అగర్వాల్, రాహుల్, పూరన్, మార్‌క్రామ్, ఫబియాన్ అలన్ తదితరులతో బ్యాటింగ్ బలంగా ఉంది. అతేగాక షమి, హర్‌ప్రీత్, అర్ష్‌దీప్‌లతో బౌలింగ్ కూడా బాగానే కనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ బరిలోకి దిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కిందటి మ్యాచ్‌లో గేల్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. దీంతో అతను ఈసారి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. పంజాబ్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకంగా తయారైంది. నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితి కింగ్స్‌కు నెలకొంది. ఇందులో ఎంతవరకు సఫలం అవుతుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News