Monday, December 23, 2024

నేడు ఉప్పల్‌లో లక్నోతో సన్‌రైజర్స్ పోరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా శనివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే కీలక మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే హైదరాబాద్‌లో ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. మరోవైపు లక్నోకు కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది. అయితే సన్‌రైజర్స్‌తో పోల్చితే లక్నో మెరుగైన స్థితిలో ఉంది. ఇప్పటికే 11 పాయింట్లు సాధించిన లక్నో రన్‌రేట్ కూడా మెరుగ్గా ఉండడం ఆ టీమ్‌కు కలిసి వచ్చే అంశమే. ఇక ఈ మ్యాచ్‌లోనూ గెలిచి నాకౌట్‌కు మరింత చేరువ కావలనే పట్టుదలతో ఉంది.
సవాల్ వంటిదే..
ఆతిథ్య హైదరాబాద్‌కు లక్నోతో జరిగే పోరు చావో రేవోగా మారింది. ఇప్పటి వరకు నాలుగు విజయాలు మాత్రమే సాధించిన సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్ అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. నాకౌట్ రేసులో నిలువాలంటే ఇకపై ఆడే నాలుగు మ్యాచుల్లోనూ భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి సన్‌రైజర్స్‌కు నెలకొంది. కిందటి మ్యాచ్‌లో రాజస్థాన్ వంటి బలమైన జట్టుపై 215 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడం హైదరాబాద్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఈ విజయం అందించిన స్ఫూర్తితో లక్నోపై మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. అయితే బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కీలక ఆటగాళ్లు రాహుల్ త్రిపాఠి, సమద్, మార్‌క్రమ్, మయాంక్ అగర్వాల్ తదితరులు పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నారు. హైదరాబాద్ వరుస ఓటములకు బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే కిందటి మ్యాచ్‌లో బ్యాటర్లు సమష్టిగా రాణించడం కాస్త ఊరటనిచ్చే అంశమే. ఈ మ్యాచ్‌లో కూడా ఓపెనర్లు అన్మోల్‌ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ జట్టుకు కీలకంగా మారారు. అభిషేక్ ఈ సీజన్‌లో కాస్త మెరుగైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడు. రాహుల్ త్రిపాఠి కూడా బ్యాట్‌ను ఝులిపించక తప్పదు. హెన్రిచ్ క్లాసెస్ కూడా జోరుమీదున్నాడు. ఇక గ్లెన్ ఫిలిప్స్ ఆడిన మొదటి మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడం జట్టుకు సానుకూల పరిణామం. రాజస్థాన్‌పై ఫిలిప్స్ 7 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది.
ఫేవరెట్‌గా సూపర్‌జెయిట్స్..
మరోవైపు లక్నో ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రెగ్యూలర్ కెప్టెన్ కెఎల్ రాహుల్ లేకున్నా లక్నో బలంగానే ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లక్నో చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జటుటలో కొదవలేదు. మేయర్స్, క్వింటన్ డికాక్, స్టోయినిస్, పూరన్, అయూష్ బడోని, కెప్టెన్ కృనాల్ పాండ్య వంటి మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక రవిబిష్ణోయ్, అవేశ్ ఖాన్, స్టోయినిస్, కృనాల్‌లతో బౌలింగ్ విభాగం కూడా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో లక్నోకే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News