Thursday, December 19, 2024

సమవుజ్జీల సమరం.. వారే కీలకం..

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు నాలుగేసి మ్యాచ్‌లు ఆడి రెండింటిలో విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనే లక్షంతో ఉన్నాయి. పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అలవోక విజయాన్ని అందుకుంది. పంజాబ్ కూడా తన చివరి మ్యాచ్‌లో పటిష్టమైన గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఈ పరిస్థితుల్లో ఇరు జట్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. దీంతో చండీగఢ్ వేదికగాజరిగే మ్యాచ్‌లో విజయం ఏ జట్టుకు వరిస్తుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఓపెనర్లే కీలకం..
కిందటి మ్యాచ్‌లో హైదరాబాద్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు శుభారంభం అందించారు. ఈ మ్యాచ్‌లో కూడా ఓపెనర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అభిషేక్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. చెన్నై తో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లోనే 37 పరుగులు సాధించాడు. అంతకుముందు ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ విధ్వంసక అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఈసారి కూడా అభిషేక్ నుంచి జట్టు ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. ట్రావిస్ హెడ్ కూడా దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నా డు. చెన్నై, ముంబైలతో జరిగిన మ్యాచుల్లో చెలరేగి ఆడాడు. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమయ్యా డు.

మరోవైపు మార్‌క్రమ్ కూడా ఫామ్‌లో ఉన్నాడు. కిందటి మ్యాచ్‌లో మార్‌క్రమ్ అర్ధ సెంచరీతో అలరించాడు. ఇక హెన్రిచ్ క్లాసె న్ రూపంలో సన్‌రైజర్స్‌కు పదునైన అస్త్రం ఉండనే ఉంది. ఈ సీజన్‌లో క్లాసెన్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోతున్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు ఆశలన్నీ అతనిపైనే నిలిచాయి. మరోవైపు షాబాజ్ అహ్మద్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, కెప్టెన్ కమిన్స్ తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. బౌలింగ్‌లోనూ సన్‌రైజర్స్ సమతూకంగా కనిపిస్తోంది. కమిన్స్, షాబాబ్, ఉనద్కట్, భువనేశ్వర్, నటరాజన్, మర్కాండే తదితరులతో పటిష్టమైన బౌలింగ్ లైనప్ జట్టుకు అందుబాటులో ఉంది. రెండు విభాగాల్లో బలంగా ఉన్న సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

గెలుపే లక్ష్యంగా
మరోవైపు ఆతిథ్య పంజాబ్ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. గుజరాత్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో 200 పరుగుల లక్ష్యాన్ని సయితం అలవోకగా ఛేదించింది. దీంతో ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. శిఖర్ ధావన్, బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కరన్, సికందర్ రజా, సికందర్ రజా, జితేష్ శర్మ, శశాంక్ సింగ్, అశుతోస్ శర్మ వంటి మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు జటుటలో ఉన్నారు. కిందటి మ్యాచ్‌లో అశుతోష్, శశాంక్ సింగ్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు. ఈసారి కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లోనూ పంజాబ్ బాగానే ఉంది. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News