తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో సౌతాఫ్రికా ఢీ
దుబాయి: పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్‌లో అసలు సిసలైన పోరాటానికి శనివారం తెరలేవనుంది. శుక్రవారంతో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లకు తెరపడింది. దీంతో ఇక సూపర్12 సమరానికి సమయం అసన్నమైంది. శనివారం అబుదాబి వేదికగా ఆస్ట్రేలియా,సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో దీనికి తెరలేస్తోంది. ఇక రాత్రి దుబాయిలో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ రన్నరప్ ఇంగ్లండ్‌ల మధ్య పోరు జరుగనుంది. సూపర్12 మ్యాచ్‌లు నవంబర్ 8 వరకు జరుగుతాయి. ఇక ఇందులో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో ఆరేసి జట్లు ఉంటాయి. గ్రూప్1లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్2లో భారత్‌తో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియా జట్లు పోటీ పడనున్నాయి.
గ్రూప్1తో పోల్చితే ఇక్కడ పోటీ అంతగా ఉండక పోవచ్చు. ఇక సూపర్12లో ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. నవంబర్ 10, 11 తేదీల్లో సెమీస్ పోరు జరుతుతుంది. ఇక ఫైనల్ సమరం నవంబర్ 14న దుబాయి వేదికగా జరుగనుంది. ఇదిలావుండగా అర్హత పోటీల ద్వారా నాలుగు జట్లు సూపర్ లీగ్‌కు అర్హత సాధించాయి. గ్రూప్‌ఎ నుంచి నమీబియా, శ్రీలంకలు ముందంజ వేశాయి. ఇక గ్రూప్‌బి నుంచి స్కాట్లాండ్, బంగ్లాదేశ్ జట్లు నాకౌట్‌కు చేరుకున్నాయి. కాగా, ఒమన్, ఐర్లాండ్, పపువా న్యూగినియా, నెదర్లాండ్స్ జట్లు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాయి.