Monday, December 23, 2024

అదానీపై కమిటీ: కాషాయ అక్కసు

- Advertisement -
- Advertisement -

అదానీ కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు హిండెన్‌బర్గ్ సంస్థ ఇచ్చిన నివేదిక సృష్టించిన సంచలనం, ఆ కంపెనీల వాటాల విలువ పతనం గురించి తెలిసిందే. ఆ నివేదిక ఆరోపణల మీద విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆరుగురితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి ఎఎం సప్రే చైర్మన్‌గా ఎస్‌బిఐ మాజీ చైర్మన్ ఓ ప్రకాష్ భట్, ఇన్ఫోసిస్ సహ ప్రారంభకుడు నందన్ నీలెకని, ప్రస్తుతం ఎన్‌బిఎఫ్‌ఐడి చైర్మన్‌గా, గతంలో ఐసిఐసిఐ, బ్రిక్స్ బాంకు, ఇన్ఫోసిస్ చైర్మన్‌గా పని చేసిన కెవి కామత్, ప్రముఖ లాయర్ సోమశేఖర సుందరేశన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి జెపి దేవధర్ సభ్యులుగా ఉన్నారు. దాన్ని తాము స్వాగతిస్తున్నామని నిజం వెల్లడవుతుందని అదానీ ఒక ప్రకటనలో స్పందించారు. కానీ కందకు లేని అనుమానం కత్తిపీటకు వచ్చినట్లు సుప్రీంకోర్టు కమిటీ తటస్థంగా వ్యవహరిస్తుందా అంటూ ఆర్‌ఎస్‌ఎస్ నడిపే నేషనలిస్ట్ హబ్ అనే మీడియా పోర్టల్ ప్రశ్నించింది. సభ్యులుగా ఉన్నవారికి గతంలో ఆర్థిక నేరాలకు పాల్పడినవారు కొందరితో ఉన్న సంబంధాలివి, మోడీని విమర్శించే సంస్థలతో, కాంగ్రెస్‌తో సంబంధాలు అంటూ ఇలాంటి వారు తటస్థంగా ఉండి నివేదిక ఇస్తారా అన్న అనుమానాలను రేకెత్తించింది. దాని మీద ఇవ్వరు ఇవ్వరు అంటూ వెంటనే స్పందనలు.

దేశంలో ఇప్పుడు జరుగుతున్న తీరుతెన్నులను బట్టి జనం ప్రతిదాన్నీ అనుమానిస్తున్నపుడు ఏ కమిటీని వేసినా దానిలో ఉన్నవారిని అనుమానించటం సహజం. తానెలాంటి తప్పు చేయలేదని అదానీ తలకిందులుగా తపస్సు చేస్తున్నప్పటికీ, నరేంద్ర మోడీ మద్దతుగా ఉన్నా, ఆర్‌ఎస్‌ఎస్ సర్టిఫికెట్ ఇచ్చినా పక్కన పెట్టేసి హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికను స్టాక్ మార్కెట్లో మదుపుదార్లు నమ్మారు. తమ వాటాలను తెగనమ్ముకొన్నారు. నెలరోజులు దాటినా జరిగిన నష్టంలో మార్పు లేదు. అడ్డగోలుగా పెంచి పెద్ద చేసినా, ఇబ్బందులు వచ్చినపుడు నరేంద్రమోడీ కూడా అదానీని కాపాడలేరని కూడా స్టాక్ మార్కెట్ మదుపుదార్లలో ఉన్నట్లు ఈ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి స్థితిలో సంఘ పరివార్ సంస్థ సుప్రీం కమిటీ మీద అనుమానాలను ఎందుకు రేకెత్తించినట్లు? భీమాకొరేగాం కేసులో మాదిరి దర్యాప్తు సంస్థే స్టాన్‌స్వామి, ఇతరుల కంప్యూటర్లలో తప్పుడు సమాచారాన్ని చొప్పించి దాన్నే సాక్ష్యంగా చూపేందుకు చూసిన దారుణం తెలిసిందే.

అదానీ కంపెనీల్లో అలాంటి దానికి అవకాశం లేదు. వివరాలను ఇప్పటికే ధ్వంసం చేయగా మిగిలిన వాటి నుంచే అక్రమాలకు పాల్పడిందీ లేనిదీ కమిటీ నిర్ధారిస్తుంది. లేదూ ఒకదానికొకటి పొంతనలేని సమాచారం ఇస్తే దాన్ని కూడా సుప్రీంకోర్టుకు అందిస్తుంది. సెబీ కూడా దర్యాప్తు జరుపుతున్నది. ఒక నియంత్రణ సంస్థగా సెబీ తీరుతెన్నుల వైఫల్యం గురించి కూడా సుప్రీం కమిటీ విచారణ జరుపుతుంది. తమ కమిటీకి సహకరించాలని సెబీని సుప్రీం ఆదేశించింది. సుప్రీం కమిటీలో వెలుగు చూడనివి, సెబీ నివేదికలో లేదా సెబీలో రానివి సుప్రీం కమిటీ నివేదికలో చోటు చేసుకోవచ్చు. ఆ రెండు నివేదికలూ బహిర్గతమైన తరువాత గతంలో దర్యాప్తు జరిపిన హిండెన్‌బర్గ్ లేదా ఆ రంగం లో నిపుణులైన వారు లేవనెత్తే అంశాలను కూడా సుప్రీంకోర్టు విచారిస్తుంది. ఇంత జరగాల్సి ఉండగా ఇంకా ఆలూ లేదూ చూలూ లేదు కొడుకుపేరు సోమలింగమా అన్నట్లుగా సంఘ పరివార్ మీడియా ఎందుకు అనుమానాలు రేకెత్తిస్తున్నట్లు? హిండెన్‌బర్గ్ నివేదికలోని అంశాలన్నింటినీ సుప్రీంకోర్టు కమిటీ విచారించటం లేదు. మన దేశం లో తిమ్మినిబమ్మిని చేసినట్లు వచ్చిన ఆరోపణల మీదనే అది పరిశీలన జరుపుతుంది.

విదేశాల్లోని డొల్లకంపెనీలు, నిధుల మళ్లింపు వంటి వాటి మీద ఏదైనా అనుమానం వచ్చే సమాచారం దొరికితే దాన్ని సుప్రీంకోర్టుకు నివేదించే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా మీడియా ఎక్కువ చేసి రాస్తున్న వార్తల వలన స్టాక్ మార్కెట్ ప్రభావితమై మదుపర్లు నష్టపోతున్నందున అదానీ హిండెన్‌బర్గ్ వివాదం గురించి వార్తలపై నిషేధం విధించాలన్న పిటీషన్‌దారుల్లో ఒకరైన ఎంఎల్ శర్మ వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. సహేతుకమైన వాదనలు వినిపించండి తప్ప నిషేధాన్ని అడగవద్దని చెప్పింది. ప్రతిపక్షాలు పార్లమెంటులో డిమాండ్ చేసిన జెపిసికి మోడీ సర్కార్ అంగీకరించి ఉంటే సుప్రీంకోర్టు కమిటీ ఉండేదీ కాదు, దాని మీద నేషనలిస్ట్ హబ్‌కు సందేహాలు లేవనెత్తే అవకాశం వచ్చి ఉండేది కాదు. జెపిసి పక్షపాతంగా పని చేసే అవకాశమే లేదు. ఎందుకంటే దానిలో అత్యధికులు అదానీని కంటికి రెప్పలా కాపాడుతున్న బిజెపి లేదా మిత్రపక్షాల సభ్యులే ఉంటారు. అయినా మోడీ ఎందుకు నిరాకరించినట్లు? ఏ పార్టీ మంది ఎందరని కాదు, ఎవరెందరున్నా అడిగిన సమాచారాన్ని కమిటీకి ఇవ్వాలి, లేకుంటే ఇవ్వలేదని సభ్యులు రాస్తారు. మెజారిటీ ఒక నివేదికను ఆమోదించినా, దానితో విభేదించేవారు కూడా మరొక నివేదికను ఇచ్చే హక్కు ఉంటుంది. ఆ రెండూ బహిరంగం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎవరు అదానీని కాపాడేందుకు పూనుకున్నది, ఎవరు అక్రమాలను వెలికి తీసేందుకు చూసిందీ యావత్ ప్రపంచానికి తెలుస్తుంది. గతంలో నరేంద్ర మోడీకి ఉందని చెప్పిన 56 అంగుళాల ఛాతీ ఇప్పుడు లేక కాదు, ఈ కారణంగానే భయపడ్డారు.

ప్రతి వ్యవస్థ తాము చెప్పినట్లు నడవాలని, తమ కనుసన్నలలో మెలగాలని దేశంలోని మితవాద శక్తులు కోరుకుంటున్నాయి. ఈ కారణంగానే తమకు నచ్చని తీర్పులు, పని తీరును అవి సహించలేకపోతున్నాయి. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలదా లేక కొంత మంది అధికారులదా నిర్ణయాధికారం అంటూ జడ్జీల కొలీజియం విధానంపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. బిబిసి డాక్యుమెంటరీ నిషేధంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వటాన్ని జీర్ణించుకోలేదు. దేశ వ్యతిరేకులకు సుప్రీంకోర్టు ఒక పనిముట్టుగా మారిందంటూ హిందూ త్వ అనుకూల శక్తులు ధ్వజమెత్తాయి. ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక (హిందీ) పాంచజన్య సంపాదకీయంలో దీన్నే పేర్కొన్నది. సుప్రీంకోర్టు ప్రజలు చెల్లించిన పన్నులతో నడుస్తున్నది. భారత్‌కు అనుకూలమైన భారత చట్టాల ప్రకారం నడుచుకొనేందుకు మన ప్రయోజనాలకు అనుగుణంగా నడిచేందుకు ఏర్పాటు చేసినదే సుప్రీంకోర్టు. అలాంటి దానిని దేశ వ్యతిరేకులు ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారని పాంచజన్య మండిపడింది. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్ అదానీ ఎంత లబ్ధి పొందితే చైనాకు అంత నష్టం అని పేర్కొన్నది. చవకబారుతనం తప్ప ఆర్థికంగా అసలు చైనాకు భారత్‌కే పోలికలేదు, ఇంక అదానీ ఎంత! అదానీ సంపదను సృష్టించాడు.

భారత పురోగమనంలో భాగస్వాములైన వారి మీద దాడి చేయకూడదని సంస్థ సహ కన్వీనర్ అశ్వనీ మహాజన్ పేర్కొన్నారు. మితవాద శక్తుల లో సహనం ఇప్పటికే నశించి మైనారిటీల మీద తెగబడుతున్న తీరుతెన్నులు తెలిసిందే. చివరికి అది ఆర్‌ఎస్‌ఎస్ మీదకు కూడా మళ్ళుతున్నది. నయా ఇండియా అనే పత్రికలో శంకర్ సహారా అనే రచయిత ఆర్‌ఎస్‌ఎస్ గురించి రాసిన వ్యాసంలో హిందువుల ప్రయోజనాలను రక్షించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ చేయాల్సినంత చేయటం లేదంటూ ధ్వజమెత్తారు.“లాఠీలను పంచుతూ హిందువుల్లో ఉన్న వీరత్వాన్ని పొగిడే సాహిత్యాన్ని ప్రచురిస్తూ ముస్లిం దురాక్రమణకు వ్యతిరేకంగా నేరుగా పోరాడాలంటూ సంఘ్ పుట్టింది. పరిస్థితి ఇప్పటికీ అదే విధంగా ఉంది. వాస్తవానికి అంతకు ముందుకంటే మరింత దిగజారింది. ఇలా ఉండగా మూడోవంతు దేశంలో హిందువులు తగ్గారు. దేశాన్ని విభజించి రెండు హిందూ వ్యతిరేక దేశాలను ఏర్పాటు చేశారు. చివరికి మిగిలిన స్వదేశంలో కూడా హిందువులు చట్టపరంగా రెండవ తరగతి పౌరులుగా మారారు. విద్య, దేవాలయాలను వారి నుంచి లాగివేసుకున్నారు.

ఇలాంటివి బ్రిటిష్ వారి ఏలుబడిలోనూ జరగలేదు. కానీ ఈ సమ్యల మీద పోరాటాలకు దూరంగా ఉండటమే కాదు సంఘపరివార్ నేతలు నోరు విప్పటం కూడా మానుకున్నారు. బాధ్యతల్లో ఉన్న సంఘ్ నాయకులు, కార్యకర్తలూ వారి విధానాలు లేదా కార్యకలాపాలను అధికారికంగా ముందుకు తీసుకుపోవాలని కోరుకోవటం లేదు. దానికి బదులు (ఉదాహరణకు గోల్వాల్కర్, సుదర్శన్, మధోక్, వాజ్‌పాయి) ఏ సర్ సంఘ్ సంచాలక్ లేదా అగ్రనేతల ప్రకటనలు, కార్యాచరణలనైనా వారి వ్యక్తిగత ఆలోచన లేదా ఆచరణ అంటున్నా రు తప్ప సంఘ్‌కు చెందినవిగా చెప్పటం లేదు, మరి అలాంటపుడు సంఘ్ భావజాలం, పని ఏమిటి?” అని శంకర్ సహారా ప్రశ్నించారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్న దేశాల్లో దాన్ని కాపాడేందుకే న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఉంటాయి.వాటి మౌలిక స్వభావం అదే. కానీ కొన్ని సందర్భాల్లో కోర్టులు ఇచ్చే తీర్పులు ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతుంటాయి. అంత మాత్రాన దేశంలో ఉన్న వ్యవస్థలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులుగా పరిగణించనవసరం లేదు.

చట్టబద్దమైన పాలన జరపాలి, నిబంధనల మేరకు వ్యాపార, పరిశ్రమలు నడపాలి, ఇలా ప్రతి విభాగానికీ కొన్ని నిబంధనలను పెట్టుబడిదారీ విధానాల్లో కూడా పెట్టుకుంటారు. వాటిని ఉల్లంఘిస్తే కోర్టులు తప్పు పట్టినంత మాత్రాన అది మౌలికంగా వ్యవస్థను తిరస్కరించినట్లు కాజాలదు. నయా ఇండియా పత్రికలో ఆర్‌ఎస్‌ఎస్‌పై శంకర్ సహారా మండిపాటు దాని మద్దతుదార్లలో గూడుకట్టుకొని ఉన్న అసహనాన్ని వెల్లడిస్తున్నది. జర్మనీ, అనేక దేశాల్లో హిట్లర్ మూకలు యూదుల పట్ల అనుసరించిన వైఖరిని మన దేశంలో ముస్లింల పట్ల ఇంకా పూర్తిగా ఎందుకు అనుసరించటం లేదన్న దుగ్ధ సంఘ పరివార్ శ్రేణుల్లో పెరుగుతున్నదని శంకర్ వాదనల తీరు వెల్లడిస్తున్నది. తమ అజెండాతో ముందుకుపోతే మొదటికే మోసం వస్తుందని తటపటాయిస్తున్నారు, మత విద్వేషాన్ని ఇంకా ఎక్కిస్తే తప్ప అమలు జరపటం సాధ్యం కాదని సంఘ పరివార్ భావిస్తున్నది. అందుకే ఆ కార్యక్రమాన్ని మరింతగా వేగిరపరుస్తున్నది తప్ప వైదొలగలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News