న్యూఢిల్లీ: నర్సింగ్ సిబ్బంది మలయాళం మాట్లాడొద్దంటూ వివాదాస్పద ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీలోని జిబి పంత్ హాస్పిటల్ సూపరింటెండెంట్ క్షమాపణలు కోరారు. దేశంలోని ఏ ప్రాంతాన్నీ, మతాన్నీ అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదని ఆయన వివరణ ఇచ్చారు. ఆదివారం జారీ చేసిన వివాదాస్పద సర్కులర్‌ను ఇప్పటికే ఆ హాస్పిటల్ యాజమాన్యం ఉపసంహరించుకున్నది. తమ హాస్పిటల్‌లోని నర్సింగ్ సిబ్బంది ఇంగ్లీష్ లేదా హిందీలో మాట్లాడాలంటూ ఆ సర్కులర్‌లో ఆదేశించారు. అది వివాదాస్పదం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం ఆ హాస్పిటల్‌కు నోటీస్ జారీ చేసింది. సిబ్బంది మాట్లాడే మలయాళం తమకు అర్థం కావడంలేదని హాస్పిటల్‌లో చేరిన కొందరు పేషెంట్లు, వారి బంధువులు ఫిర్యాదు చేసినందునే ఆ సర్కులర్ జారీ చేశామని సూపరింటెండెంట్ తెలిపారు. ఆ హాస్పిటల్‌లో మొత్తం 850మంది నర్సింగ్ సిబ్బంది ఉండగా,వారిలో 400మంది మలయాళీలే కావడం గమనార్హం.