Sunday, December 22, 2024

ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు, అధికారుల తీరుపై ఉన్నతాధికారుల క్లాస్!

- Advertisement -
- Advertisement -

శాఖను ప్రక్షాళించాలని ఉన్నతాధికారుల నిర్ణయం
గతంలో బదిలీ అయిన అధికారులు మరోమారు పాత చోటుకు రావాలని విశ్వప్రయత్నం!
అంతా తానై చక్రం తిప్పుతున్న ఓ ఉన్నతాధికారి

మనతెలంగాణ/హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో రచ్చకెక్కిన విభేదాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు క్లాస్ తీసుకున్నట్టుగా తెలిసింది. మరోమారు ఒకరిపై ఒకరు రచ్చకెక్కితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ శాఖలో కొందరు అధికారుల అవినీతి చిట్టాను ఆ శాఖ ఉన్నతాధికారుల వద్దకు చేరడం, దీంతోపాటు పలువురు అధికారులపై ఎసిబి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో ఆ శాఖను ప్రక్షాళన చేయాలని కూడా ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టుగా సమాచారం. పలువురు అధికారులు, ఉద్యోగులు ఒకేచోట సంవత్సరాలుగా తిష్టవేయడం వల్ల ఇలాంటి అవినీతి అధికంగా జరుగుతుందని భావించిన ఆ శాఖ ఉన్నతాధికారులు, ఆ అవినీతి అధికారులను నాన్‌ఫోకల్ పోస్టింగ్‌లో వేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం.
సిఎం కుటుంబసభ్యులు తెలుసంటూ ఫైరవీలు…
దీంతోపాటు రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఎక్సైజ్ అధికారులు, ఉద్యోగులను కూడా బదిలీ చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు తమకు ఫోకల్ పోస్టింగ్ ఇవ్వాలని రాజకీయంగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్టుగా తెలిసింది. గతంలో కొందరు గ్రేటర్ పరిధిలో పనిచేసిన సిఐలు తమకు సిఎం రేవంత్ కుటుంబసభ్యులు తెలిసనీ, తమకు అనుకూలంగా పోస్టింగ్ ఇవ్వాలని ఉన్నతాధికా రులపై ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలిసింది. ఒకేచోట సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులను, అధికారులను అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం మార్చింది. దీంతోపాటు కొందరికి పదోన్నతులు లభించడంతో వారు కూడా మారిపోయారు. అయితే వీరిలో కొందరు మాత్రం పాత స్థానాలకే మళ్లీ రావాలని ప్రస్తుతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు పలు విషయాలపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినా వారి వ్యవహార శైలిలో మార్పు రాకపోవడం విచిత్రం. అయితే కొందరు ఎక్సైజ్ అధికారులు మంచి పోస్టింగ్ ఇప్పించాలని సిఎం బంధువుల చుట్టూ తిరుగుతున్నట్టుగా సమాచారం.
కక్షసాధింపు చర్యలపై ఉద్యోగుల భయాందోళన…
అయితే ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది. గతంలో ఓ వర్గం వారు తనను ఇబ్బందులు పెట్టారని అందులో భాగంగా ప్రస్తుతం వారిని ఇబ్బందులు పెట్టాలన్న ఉద్ధేశ్యంతో వారి యూనియన్‌లోని పలువురు ఉద్యోగులను ఆయన టార్గెట్ చేయడంతో పాటు వారిని బదిలీలు చేయించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. అందులో భాగంగానే ఆయన వెనుకనుంచి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టుగా సమాచారం. ఈ బదిలీలను ఆయన దగ్గరుండి చూసుకుంటున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి బదిలీ అయిన ఉద్యోగులు, అధికారులను వారిపై ఉసిగొల్పుతున్నట్టుగా ఎక్సైజ్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బదిలీలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉద్యోగులతో పాటు అధికారులు ఆ ఉన్నతాధికారి తమపై కక్షసాధింపు చర్యలు చేపడతారని వారు భయపడుతుండడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News