వలసదారులు, విదేశీ విద్యార్థుల విషయంలో అగ్రరాజ్యం ఆంక్షలు మరీ మితిమీరుతున్నాయి.పేరుకు ప్రజాస్వామిక దేశమే అయినా, పెత్తందారీ పోకడలు పోతూ విదేశీయులను ముప్పుతిప్పలు పెడుతోంది. ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులపై విరుచుకుపడటం మొదలుపెట్టారు. తమ దేశానికి వచ్చి ఇక్కడే తిష్ఠ వేసుకుని కూర్చుని, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నారనే ఆగ్రహంతో అక్రమ వలసదారుల్ని యుద్ధవిమానాల్లో ఆయా దేశాలకు తిప్పి పంపించిన ట్రంప్ మహాశయుడు అంతటితో ఆగలేదు. తమ యూనివర్శిటీల్లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను ఎలా క్షోభపెట్టాలా అనేది ఇప్పడు ఆయన ఎజెండాలో ప్రధానంశమైంది. లేనిపోని ఆంక్షలు విధిస్తూ, విద్యార్థులను వెనక్కు పంపే బృహత్తర కార్యక్రమానికి ఆయన తెరతీశారు.
సామాజిక మాధ్యమాల్లో యూదు వ్యతిరేక పోస్టులు పెట్టినా, వాటిని లైక్ చేసినా, షేర్ చేసినా తప్పేనంటోంది ఆయన ప్రభుత్వం. అంతేకాదు, వేగంగా వాహనం నడిపినా వీసా రద్దు చేస్తామంటూ మతిమాలిన ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే విద్యార్థి వీసాల్లో కోత విధిస్తున్న అమెరికా ప్రభుత్వం, ఎలాగోలా వీసా సంపాదించి వివిధ యూనివర్శిటీల్లో చదువుకుంటున్న విద్యార్థులపైనా ప్రతాపం చూపిస్తూండటంతో పరిస్థితి గందరగోళంగా మారింది. విద్యార్థి వీసాల్లో అమెరికా కోత విధించడం బైడెన్ హయాంలోనే మొదలైనా, ట్రంప్ ఆ విధానాన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్తున్నారు. గత ఏడాది 40 శాతం వీసాలు తిరస్కరణకు గురి కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య రెట్టింపునకు పైనే ఉంటుందని అంచనా. స్టూడెంట్ వీసాలు మొదలు గ్రీన్ కార్డు దరఖాస్తుదారుల వరకూ అందరిపైనా నిఘా పెడుతోంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, లెబనాన్ హెజ్బొల్లా, యెమెన్ హుతీల గ్రూపులను అమెరికా చాలాకాలం క్రితమే ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది.
వీటికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే యూదు వ్యతిరేక చర్యలుగా పరిగణించి, వీసాలు రద్దు చేస్తామంటోంది. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు పలకడం నేరమే కావచ్చు, కానీ, అందుకు ఏకంగా వీసాలు రద్దు చేసి, విద్యార్థుల్ని స్వదేశాలకు తిప్పిపంపడం దారుణం. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను సామాజిక మాధ్యమాల్లో ఖండించిన పాపానికి కొందరు విద్యార్థుల వీసాలు రద్దు కావడం ట్రంప్ ప్రభుత్వం తెంపరితనానికి పరాకాష్ఠ. ఒక్క గత నెలలోనే అమెరికా ప్రభుత్వం 300 మందికి పైగా వీసాలను రద్దు చేయడం ఈ సందర్భంగా గమనార్హం. చూడబోతే, వీసాలను రద్దు చేసి, విదేశీ విద్యార్థులకు గేట్లు మూయడమెలా అనే అంశంపై ట్రంప్ మహాశయుడు పిహెచ్‌డి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఏ దేశంలోనైనా వేగంగా వాహనం నడిపినా, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినా చలాన్లతో సరిపెడతారు. కానీ, అగ్రరాజ్యాధినేత మాత్రం అలాంటివారి వీసాలను రద్దు చేస్తామంటున్నారు.
కృత్రిమ మేధ సాయంతో విద్యార్థుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం, సదరు విద్యార్థులు క్షమాపణ చెప్పినా, తమ పోస్టుల్ని సామాజిక మాధ్యమాల నుంచి ఉపసంహరించుకుంటున్నా కనికరించడం లేదు. ఫెడరల్ ఇమిగ్రేషన్ డేటాబేస్ చూసిన హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల అధికారులు దేశంలో ఏకపక్షంగా విదేశీ విద్యార్థుల వీసాల రద్దు జరుగుతోందని తెలిసి నిర్ఘాంతపోయారట. ట్రంప్ ప్రభుత్వం నియంతృత్వ పోకడలను గమనించిన హెచ్1బి వీసాదారులు సైతం పెట్టేబేడా సర్దుకుని స్వదేశాలకు పయనమయ్యే ఆలోచనలో పడ్డారంటే అందులో ఆశ్చర్యం ఏముంటుంది? వీరంతా అమెరికాను వీడితే, అక్కడి ఐటి రంగం కుదేలవడం ఖాయం.
తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లని మొండిగా వాదించే ట్రంప్‌కు ఇవేవీ పట్టడంలేదు. దాంతో ఆయా కంపెనీలే రంగంలోకి దిగి విదేశీ ఉద్యోగుల్ని దేశం విడిచి వెళ్లొద్దంటూ బతిమాలుకుంటున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఒకవేళ వారు స్వదేశానికి వెళ్తే, తిరిగి అమెరికాకు రానివ్వరేమోననే భయం కూడా ఇందుకు కారణం. భారత్ విషయానికొస్తే, సుంకాల బాదుడుతోపాటు విదేశీ విద్యార్థుల వీసాలపై వేటు కూడా ప్రధాన సమస్యగానే భావించాలి. అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో భారత్‌దే అగ్రస్థానం కాగా, అందులో అత్యధికులు తెలుగురాష్ట్రాలవారే. ఈ నేపథ్యంలో సుంకాలపై అగ్రరాజ్యంతో చర్చించేందుకు సమాయత్తమవుతున్న భారత ప్రభుత్వం వీసాలపై ఆంక్షల సడలింపును కూడా చర్చించాలి. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వంపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒత్తిడి తేవాలి.