హైదరాబాద్: తన పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, ప్రముఖల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షను ఆయన అందుకున్నారు. వాస్తవానికి ఈనెల 12న పుట్టిన రోజును చెన్నైలో అభిమానుల మధ్య రజనీకాంత్ జరుపుకున్నారు. అయితే, ఆ రోజు కాకుండా ఈనెల 14వ తేది (బుధవారం) సాయింత్రం తన కుమార్తె ఐశ్వర్యతో కలిసి రజనీకాంత్ తిరుమలకు వచ్చారు. మరుసటిరోజు గురువారం ఉదయం శ్రీవారిని రజనీకాంత్, ఆయన కుమార్తె కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ప్రత్యేక క్యూలైన్‌లో వెళ్ళేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
అనంతరం అక్కడ నుంచి కడప జిల్లాలోని అమీన్ పీర్ దర్గా (కడప పెద్ద దర్గా) సందర్శించేందుకు కుమార్తె ఐశ్వర్యతో కలిసి రజనీకాంత్ వెళ్ళారు. రజనీకాంత్ రాక సందర్శంగా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. అదే సమయంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ ఆయన కుమారుడు అమీన్, రజనీకాంత్ ఆయన కుమార్తె ఐశ్వర్య కలిసి పెద్ద దర్గాలో ప్రతేక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద దర్గా దర్శనానికి తొలిసారిగా వచ్చిన రజనీకాంత్, అలాగే ఎ.ఆర్. రెహమాన్‌కు అక్కడ ప్రజలు ఘన స్వాగతం పలికారు.
తమ అభిమాన నటుడు రజనీకాంత్‌ను చూసేందుకు జనాలు ఎగబడి సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. పెద్ద దర్గా విశిష్టతను రజనీకాంత్‌కు అక్కడ పెద్దలు వివరించారు. దర్గా సంప్రదాయం ప్రకారం రజనీకాంత్, రెహమాన్‌లకు తలపాగా చుట్టారు. ప్రశాంతమైన వాతావరణంలో వారిరువురు ప్రార్ధనలు చేసుకునేలా అవకాశం కల్పించారు. దాదాపు రెండు గంటల పాటు రజనీకాంత్, రెహమాన్ పెద్ద దర్గాలోనే గడిపారు. అనంతరం మధ్యాహ్నానం కడప విమానాశ్రయం నుంచి చెన్నైకి వారు బయలుదేరారు.