ప్రపంచ దేశాలలో చెప్పుకోదగ్గ విశిష్ట గుర్తింపు ఉన్నది మన దేశానికి, బ్రిటిష్ వారు సుమారు రెండూ వందల ఏండ్ల పాలన చేసినా కూడా మన దేశ సంస్కృతిని మార్చలేకపోయారు. అదే విధంగా భారత్ చాలా విశాలమైనది భిన్నత్వంలో ఏకత్వం కలది. విభిన్న సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు పాటించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. పది కిలోమీటర్ల ఒక కల్చర్ ఉంటుంది. అలాంటి విభిన్నమైన దేశం మనది. దానితోపాటే మూఢత్వం కూడా ఎక్కువగా మన దేశంలో ఉంటుంది. ప్రాచీన కాలం నుండి అది ఇంకా అలా వస్తూనే ఉంది. ప్రజలు మూఢత్వాన్నే ఎక్కువ నమ్ముతారు. దేశంలో సైన్స్ అభివృద్ధి చెందినా, ఆధునిక యుగంలో బతికున్నా, ప్రపంచ దేశాలు రోజురోజుకీ ఆధునిక యుగంవైపు వెళ్తుంటే మనం మాత్రమే ఇలా మూఢత్వ, కల్పితాలు, దేవుడు మీద నమ్మకం పెట్టుకొని జీవించడం జరుగుతున్నది.దేశంలో కొందరు ‘బాబా’ అనే అవతారం ఎత్తి, వృత్తిగా చేసికొని నేనే దేవుడిని నన్ను కొలవండి అంటూ ప్రగల్భాలు పలుకుతూ దేశాన్ని ఇంకా వెనక్కి నెట్టివేస్తున్నారు దొంగ బాబాలు. మొన్న హత్రాస్ (ఉత్తరప్రదేశ్)లో జరిగిన సంఘటన మనంచూడాలి. సుమారు 121 మంది తొక్కిసలాటలో
చనిపోయారు.వారిలో ఎక్కువగా మహిళలే అన్నారు. బాబా పాదాల మట్టి తీసుకోవడం కోసం వెళ్లిన ప్రజల ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిశాయి. ఇప్పుడు భోలే బాబా పరారీలో ఉన్నాడు. 90లలో ఉద్యోగం వదిలి బాబా అవతారం ఎత్తిన భోలే ఇప్పుడు వందల ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడు. రోజు బతకాలంటే తినాలి, దానికి పండించుకోవాలి, దానికి దేవుడు వచ్చి పెట్టడు, దేవుడు అనే ఒక నమ్మకం, ఆధ్యాత్మికం, భవిష్యవాణి, జాతకం ఇవన్నీ వాళ్ళు బతకడానికి చేసుకున్న ఒక అస్త్రం అని చెప్పవచ్చు. దేశ సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న కాలంలో కూడా దయ్యం, భూతం, బాబాలు, స్వామీజీలు అంటూ దేశాన్ని వెనక్కి నెట్టివేస్తున్న చీడపురుగులు అని చెప్పాలి. ఎందుకంటే మంచి మార్గం చెప్పే క్రమంలో దొంగ బాబాల పేరు మీద వెలసిన వాళ్ళని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వకూడదు. ముఖ్యంగా బాబాలు, స్వామిజీలు, స్వయంగా దేవుడి నన్ను ఈ భూమిపై నడిపిస్తున్నాడు అని, నేనే దేవుడిని అని అద్భుతాలు చేస్తాం అని చెప్పుతారు. ఇది చూసి ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉంటారు.
గతంలో మనం చాలా మంది బాబాలను చూశాం. ముందు ఒకటి వెనక ఒకటి, డేరా బాబా అనే అతను పెద్ద రేపిస్ట్, ప్రభుత్వం ఆయన లీలలు చూసి జైల్లో వేసింది. పెద్ద సంఖ్యలో అమ్మాయిల్ని ఇబ్బందులకు గురి చేసిన దొంగ బాబా. అదే విధంగా సో కాల్డ్‌గా చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్లంతా ఏదో అద్భుతాలు చేస్తారని నమ్మి మోసపోతున్నారు. కాబట్టి ప్రజలు మేల్కొవాలి, ఎలాంటి అద్భుతాలు జరగవు, అన్నీ వాళ్ళు కల్పించుకునేవే. ముఖ్యంగా ఇలాంటి బాబాలకు రాజకీయంగా మద్దతు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి పెద్ద మాస్ ఫాలోయింగా ఉండటం వల్ల వీళ్ళు వాళ్ళని, వాళ్ళు వీళ్ళని కలుపుకొని వెళ్తుంటారు. చాలా సభలలో బాబాల వద్దకి రాజకీయ నాయకులు వెళ్ళడం విడ్డూరం. ఏదైనా జరిగితే వెంటనే రాజకీయంగా మద్దతు ఉంటుందని, కొంత మేర లోపాయికారిగా ఆర్ధిక లావాదేవీలు కూడా జరగవచ్చు. కాబట్టి వీళ్ళు ఇంకా అభివృద్ధి చెందడానికి రాజకీయం ఒక భాగమేనని చెప్పుకోవచ్చు.
బాబాలు ఉండే ఆశ్రమాలకు విరాళాలు, స్థలాలకు ప్రభుత్వం ఎలాంటి పన్ను విధించదు. వీరికి పన్ను రాయితీలు కల్పించడం జరుగుతుంది. ఎంతో మంది బాబాలకు కొన్ని వందల ఎకరాల భూమి ఆధీనంలో ఉంటుంది. ప్రజలు ఎక్కువ మొత్తంలో వీరికి డబ్బులు ఇస్తూ ఉంటారు. వాటి ద్వారా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వీళ్లకు పెద్ద సెక్యూరిటి గార్డ్, పక్కన అమ్మాయిలు, ఇంకా అడ్వాన్స్ అయితే రైఫిల్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి బాబాలను నమ్మొద్దు. మూఢ నమ్మకాలు వదిలివేయాలి. ప్రజలు నమ్మకమే వీళ్ల పెట్టుబడి. వీళ్లకు కలిసొచ్చే అవకాశమని చెప్పవచ్చు. ఏదిఏమైనప్పటికీ భారత దేశం అభివృద్ధి చెందిన దేశా జాబితాలో చేరాలంటే ఇంకా ఇలాంటి నమ్మకాలను వదిలి ఆధునిక సమాజంలో వైపు ప్రయాణం చేయాలి. దీనంతటికీ కారణం నిరక్షరాస్యత, పేదరికం, అధిక సంతానం, మూఢ నమ్మకాలు, అధిక ఆచారాలు, సంప్రదాయాలు ఎక్కువగా ఉండటం ఇవన్నీ కారణంగా చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వారికి చెక్ పెట్టాలి అని కోరుకుందాం. భావిభారతం ఇంకా అభివృద్ధి చెంది ప్రపంచంలో మూఢ నమ్మకాలు లేని దేశంగా అవతరించే విధంగా చూద్దాం.!