Monday, December 23, 2024

మౌఢ్యాన్ని వదిలి విజ్ఞాన పథంలోకి..

- Advertisement -
- Advertisement -

Superstitions are universal

మూఢ నమ్మకాలు విశ్వవ్యాప్తంగా వున్నాయి. అవి ప్రాచీన, మధ్య ఆధునిక యుగాలకు సంబంధించినవి కలగాపులగంగా ప్రపంచ పౌరుల్లో వుంటూనే వున్నాయి. ఇప్పటికీ అరణ్యాల్లో, కొండల్లో, కోనల్లో నివసించే ఆదిమ, గిరిజన జాతుల్లో ఇంకా కొన్ని అనాగరిక విశ్వాసాలు వర్థిల్లుతూనే వున్నాయి.అత్యాధునికుల్లో కూడా కాలానుగుణంగా కొత్త కొత్త మూఢ విశ్వాసాలు ఏర్పడుతూ, ప్రాచుర్యం పొందుతూ స్థిరపడుతున్నాయి. ఇందుకు గతం మీద వున్న గౌరవం, పూర్వీకుల పట్ల ఉన్న శ్రద్ధ కొంత వరకు కారణాలు కావొచ్చు. తమకన్నా తమ పూర్వీకులు తెలివి గల వారని, అన్నీ ఆలోచించి వారు ఆచారాలు, సంప్రదాయాలు ఏర్పరిచారని ఒక నమ్మకం! అది మూఢ నమ్మకమేమోననే అనుమానం వారికి రాదు. సమకాలీనంలో ఉన్న విజ్ఞులు చెప్పింది వింటారు గాని, పాటించాల్సి వచ్చే సరికి, పూర్వీకుల భావజాలంలోకి వెళ్లిపోతారు. తమదే గొప్ప సంస్కృతి అని భుజాలు తడుముకుంటారు. వాటిలోని అహేతుక విషయాల్ని ప్రశ్నించరు.

ఉదాహరణకు కొన్ని అంధ విశ్వాసాల్ని పరిశీలిద్దాం! దేవుడు సృష్టికర్త అని, అతడే ఈ చరాచర జగత్తుని సృష్టించాడని, మనుషుల జీవితాల్ని అతడే అజమాయిషీ చేస్తున్నాడని, మనుషులు నిమిత్తమాత్రులని, ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో ఒక గట్టి నమ్మకం వుంది. శతాబ్దాలుగా అది చెక్కు చెదరకుండా వుంది. అయితే ఆ విశ్వాసాల్ని నిలపడానికి మత బోధకులు తమతమ మతాల ద్వారా విశ్వ ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఇంకా చేస్తూనే వున్నారు. దేవుడే ఈ విశ్వాన్ని సృష్టించాడన్న వాదన ఎంత బలహీనమైందంటే అది ఒక చిన్న ప్రశ్నతో కుప్పకూలిపోతుంది. అన్ని మతాల మత విశ్వాసకులు తమ దేవుడే ఈ విశ్వాన్ని, మనిషిని సృష్టించాడని నమ్ముతున్నారు. సృష్టికర్త ఒక్కడే అని చెపుతారు కాని, నమ్మరు. “తమ మతానికి సంబంధించిన దేవుడే అసలు దేవుడని, ఇతర మతాల దేవుళ్లు దేవుళ్లే కాదు” అని అనుకుంటూ వుంటారు.

అంటే ఏమిటీ? ఈ సృష్టికి మూల కారకుడు ఒక్కడే అయితే, అందరూ అతణ్ణే నమ్మాలి. కాని అలా జరగడం లేదు. అంటే విశ్వాసకుల భ్రమల్లోంచి, ఊహల్లోంచి దేవుళ్లు వివిధ రకాలుగా పుట్టుకొచ్చారని అర్థమవుతూ వుంది. పైగా ఆధునిక వైజ్ఞానిక పరిశోధనల్లోగాని, విశ్వం పుట్టుక, మనిషి పుట్టుక, పరిణామ వాద పరిశీలనల్లో గాని, ఇతర గ్రహాల అన్వేషణలో గాని దేవుడు కనబడలేదు. అతని ఉనికి శక్తి మహిమ వంటివి ఏవీ ఎక్కడా ఎప్పుడూ బయటపడలేదు. ఇక ముందు బయట పడతాయనడానికి ఆధారాలు కూడా లేవు. ఒక బలహీనమైన కరోనా వైరస్ విశ్వ వ్యాప్తమైనట్టు, బలహీనమైన దైవ భావన కూడా విశ్వ వ్యాప్తమై బలంగా స్థిరపడింది.

పిల్లలు ఎలా పుడతారన్న జ్ఞానం అడవిలో వుండే జంతువుల క్కూడా వుంది. కాని, మనుషులు మాత్రమే తెలుసుకోలేక, పిల్లల కోసం పూజలు చేస్తూ, దీక్షలు పూనుతూ, మొక్కులు మొక్కుతూ గుళ్లూ, గోపురాలు ఇతర మత ప్రార్థనా స్థలాల చుట్టూ తిరుగుతుంటారు. ఇక జాతకాలు చూడడం గురించి పెద్ద తతంగమే జరుగుతుంది. మరీ ముఖ్యంగా పెళ్లిళ్లలో వధూవరుల జాతకాలు కలవడమన్న హాస్యాస్పదమైన విషయం మరొకటి వుండదు. ఇప్పుడు జాతకాల ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది కాని, లోగడ చాలా ప్రాముఖ్యమిచ్చేవారు.

ఇచ్చినా ఎందుకు మరి అందరి వైవాహిక జీవితం సజావుగా కొనసాగలేదూ? జాతకాలు చూసేవారు తమని తాము మోసం చేసుకుంటే, జాతకాలు చెప్పించుకున్న వారు మోసపోయిన అజ్ఞానులన్న మాట! సుమూహూర్తం, దుర్ముహూర్తం అనేవి ఉదర పోషణార్థం కొందరు కల్పించుకున్న ఉపాయాలు. అవే తమ జీవితాలకు అపాయాలవుతాయని జనం గుర్తించుకోలేకపోయారు. ఇక జ్యోతిష్యం గురించి చాలా చర్చే జరిగింది. అదొక అహేతుకమైన శాస్త్రం జ్యోతిష్యం ఇప్పుడు వ్యక్తులకు మాత్రమే కాదు, దేశాలకు, రాష్ట్రాల క్కూడా చెపుతున్నారు. అడిగితే జిల్లాలకు, మండలాలకు కూడా చెపుతారు. ఇటీవల రాజకీయ పార్టీల భవిష్యత్తు, ప్రభుత్వాల భవిష్యత్తు కూడా జ్యోతిష్యులు చెపుతున్నారు. చెప్పే వాడికి వినేవాడు లోకువ అని అన్నది అందుకే కాబోలు! అదేమిటో ఎయిడ్స్, కరోనా లాంటి వ్యాధులు వ్యాపిస్తాయని ఈ జ్యోతిష్య పండితులు ముందుగా చెప్పలేరు. చైనా సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతాయని చెప్పలేరు. వరదలు, కరువులు ఎప్పుడొస్తాయో చెప్పలేరు. ఊరికే నోటికొచ్చింది వాగి, డబ్బులు గుంజుడమే తమ కర్తవ్యం అని అనుకుంటారు. అదెంతటి అబద్ధపు బతుకో వారికి వారు బేరీజు వేసుకోలేరు. కరోనా గురించి గాని, వైరస్ గురించి గాని రెండు ముక్కలు చెప్పలేని ఓ యోగా మాస్టర్ కరోనా నివారణకు ఆయుర్వేదంలో మందు తయారు చేశానంటాడు.

గట్టిగా నిలదీస్తే అది ఉట్టి జలుబు మందే అని మాట మారుస్తాడు. ‘నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గూ?’ అని ఇలా కొందరు అబద్ధపు బతుకులు బతుకుతుంటారు. దేశంలో చాలా మంది మత గురువులు, యోగులు, ముల్లాలు, ఫాదర్లు చేస్తున్న పనులు ఇలాంటివే. మూఢ నమ్మకాల్లో మునిగితేలే ప్రభుత్వాలు రాజ్యాలేలుతున్నప్పుడు మరి ఇలాంటి వారిపై అజమాయిషీ చేసేదెవరూ? చెప్పింది చెప్పినట్లు జరగకపోతే జ్యోతిష్కులు జాతకాల పండితులు శిక్షలకు సిద్ధపడాలి జనానికి నమ్మకం కలిగించాలి కలిగిస్తారా??దేవుడెంతటి అబద్ధమో, దయ్యం కూడా అంతే అబద్ధం అయినప్పుడు, కోరికలు తీరకుండా అర్థాంతరంగా చనిపోయిన వారు దయ్యాలవుతారన్నది అపోహ మాత్రమే. వ్యాపారం చేసుకోవడానికి దేవుడి మహిమలు, దయ్యం బాధలు రాసి కొందరు రచయితలయ్యారు. కొందరు సినీ దర్శకులయ్యారు. మానసిక బలహీనులు వాటికి ఆకర్షితులై, చూసి ఆనందించారు. అసలు పునర్జన్మలకే రుజువులు లేనప్పుడు ఇక జన్మలో ఉచ్ఛం నీచం అనే తేడాలు ఎలా వుంటాయి, ఎందుకుంటాయి? జీవ శాస్త్రంలో ప్రాథమిక అంశాల్ని అర్థం చేసుకున్నా ఇలాంటి బూజుపట్టిన ఆలోచనల్ని వదిలించుకోవచ్చు.

అరచేతిలోని రేఖలు, నుదుటి మీది గీతలు జీవితాల్ని శాసిస్తాయన్న ఆలోచనలు అజ్ఞానంతో కూడుకున్నవి. పిండ దశలో తల్లిగర్భంలో వున్నప్పుడు శిశువులు చేతులు ముడుచుకుని వుంటాయి కాబట్టి, అలా గీతలు, రేఖలూ ఏర్పడతాయి. అంతేగాని, ఏదో అతీతశక్తి పని గట్టుకుని కూర్చుని ఒక్కొక్కరికి వాటిని గీయలేదు. ఈ ఆధునిక యుగంలో మనకు మరొక అసంబద్ధమైన వ్యాపారం కనిపిస్తోంది. పేరులోని అక్షరాల్ని మార్చుకోవడం ద్వారా జీవితాలు మారతాయి. దుఃఖాలు దూరమవుతాయి. ఆనందాలు చేరువవుతాయి అనే ఒక పనికి మాలిన దుష్ప్రచారం చేసుకుంటూ మీడియాను వాడుకుంటూ కొందరు హాయిగా అబద్ధపు బతుకులు బతికేస్తున్నారు. ఆత్మల్ని నమ్మే ఇలాంటి వారికి ఆత్మసాక్షి అనేది ఎందుకు వుండదో తెలియదు.

ఇలాంటి మూర్ఖుల్ని వారి మానాన వారిని వదిలేయకుండా, దిగజారిన బడాబడా టెలివిజన్ ఛానళ్లు కొన్ని, ప్రత్యక్ష ప్రసారం చేసి చూపెడుతుంటాయి. ఇలా అహేతుకమైన విషయాలు ప్రచారం చేయడమేనా వాటి పని? పైగా ప్రజల కోసమే పని చేస్తున్నామని డబ్బా కూడా కొట్టుకుంటూ వుంటాయి. అలాగే రంగురాళ్ల వుంగరాలు జీవితాల్లో మంచి మార్పులు తెస్తాయని కొందరు అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ బతుకులు వెళ్లబోసుకుంటూ వున్నారు.

ఏవో విశ్వాసాల ఆధారంగా తాయత్తులు కట్టుకుంటే దుష్టశక్తులు దూరం కావు. అసలు అలాంటి అతీత శక్తులు ఏవీ వుండవని నిర్ధారించుకున్నాక ఇక ఇలాంటివి ఎలా వుంటాయి? అజ్ఞానంతో, అమాయకత్వంతో జనం ఇలాంటివి నమ్ముతుంటారు. మనం వాళ్లని అందులోంచి బయటపడేయాలి. ఒంటి మీది పుట్టుమచ్చలు జీవితంలో జరగబోయే సంఘటనలకు కొలబద్దలు కావు. అలాగే స్త్రీలకు సంబంధించిన మూఢ విశ్వాసాలు జనంలో లెక్కలేనన్ని వున్నాయి. అందులో బహిష్టు సమయంలో స్త్రీలు వంట గదిలోకి రాకూడదన్నది ఒకటైతే.. చెడు రక్తం బహిష్టు ద్వారా బయటికి వెళుతుంది అనేది మరొకటి. బాణామతి లేదా చేతబడితో మనుషుల్ని చంపొచ్చుననేది ఒక మూఢ నమ్మకం. అలాగే పాములు, తేళ్లూ కాటేస్తే విషాన్ని మంత్రాలతో తొలగించవచ్చని అనుకోవడం మరొక మూఢ నమ్మకం. దయ్యం పట్టినా, చేతబడి చేసినా భూతవైద్యులు వాటని నయం చేయగలరని నమ్మడం ఇంకో మూఢ నమ్మకం. క్షుద్ర విద్యల ద్వారా అతీత శక్తులు స్వాధీనం అవుతాయనుకోవడం మరింకో మూఢ నమ్మకం ఇలా ఎన్నెన్నో మూఢ విశ్వాసాలు జనంలో వున్నాయి. వాటిని ఎంత త్వరగా తొలగించగలిగితే అంత మంచిది. దేవుడే అబద్ధమైపోయినప్పుడు ఆ భావన చుట్టూ రూపుదిద్దుకున్న ఇతర విశ్వాసాలకు విలువ ఏముంటుంది? అతని ఉనికే ప్రశ్నార్థకంగా వున్నప్పుడు ఇతర జీవరాసులకు భిన్నంగా అతను మనిషిని సృష్టించాడనడానికి ఆధారాలెక్కడ? పాప పుణ్యాలు, స్వర్గ నరకాలు, పునర్జన్మలకు అర్థం వుంటుందా? గ్రహాల కదలికలు మానవ జీవితాల్ని ప్రభావితం చేస్తాయన్నది పచ్చి అబద్ధమైతే, భజనలకు, నైవేద్యాలకు, శాంతి పూజలకు అర్థముంటుందా? దిక్పాలకులనేవారు వుండనే వుండరుకదా? యజ్ఞాల ద్వారా వర్షాలు కురిపింవచ్చని, ప్రపంచ శాంతిని నెలకొల్పవచ్చని చెప్పడంలో ఏ మాత్రమూ నిజం లేదు. వేద కాలం నుండి యజ్ఞాలు, యాగాలు జరుగుతున్నాయని సనాతన సంప్రదాయవాదులు చెపుతుంటారు. మరి అదే నిజమైతే ఈ దేశంలో చిన్నవి, పెద్దవి కలుపుకొని లక్షల సార్లు యుద్ధాలు ఎందుకు జరిగాయి? ఇటు పాకిస్థాన్, అటు చైనాలతో మన దేశం ఈ రోజు కూడా సమస్యల్ని ఎదుర్కొంటూనే వుంది!

గతంలో మన పూర్వీకులు చేసిన శాంతి హోమాల ఫలితంగా దేశంలోనూ, ప్రపంచంలోనూ శాంతి స్థాపించబడాలి కదా? మరెందుకు స్థాపించబడలేదూ? అంటేవాటికి ఆశక్తి లేదిన అర్థం! నోములు, వ్రతాలు ఆచరిస్తే భారతీయ మహిళల సౌభాగ్యం వర్ధిల్లుతుందని చెప్పారు కదా మరి ఏమైందీ? వయసుతో నిమిత్తం లేకుండా మత విశ్వాసకులే స్త్రీల శరీరాలతో, జీవితాలతో ఆడుకుంటున్నారు కదా? ఏ ఒక్క దానికీ సహేతుకంగా సమాధానం చెప్పలేని స్థితిలో మతాలు, మత విశ్వాసకులు, మత గురువులూ ఉన్నప్పుడు సామాన్య జనం ఏం చేస్తారూ? మత విశ్వాసాల్లోంచి బయటపడతారు. రక్షణ కల్పించే రాజ్యాంగం వైపు, మానవీయ విలువల వైపు రావడానికి ప్రయత్నిస్తారు. తప్పదు ఇలాంటి విషమ ఘడియల్లో వారిని వైజ్ఞానిక స్పృహ కాపాడుతుంది. వాస్తవాల్ని జీర్ణించుకోగలిగే మనో ధైర్యాన్ని అందిస్తుంది. తమ తమ మత విశ్వాసాల్ని, దైవ భావనని విడనాడి విశ్వ మానవులుగా ఎదగడానికి తోడ్పడుతుంది. జంతు బలుల ద్వారా గ్రామ దేవతల్ని శాంత పరచవచ్చు ననుకోవడం వంటి మూఢ నమ్మకాలు వేలకు వేలు మన ప్రజా జీవనంలో ఉదాత్తమైన శాస్త్రీయ మానవవాద ప్రపంచానికి మనం రూపకల్పన చేసుకోవాల్సి వుంది. చాలా కష్టమైన పనే కాని, జనంలో వివేకం పెరిగితే, అది తప్పక సాధ్యమవుతుంది! ఆ ప్రయత్నంలో మనలో ప్రతి ఒక్కరం నిమగ్నమై వుండాల్సిందే!
జిందగీ క్యౌంన అబ్ థోడాసా బదల్ జాయె హం? / ఖ్యాబోక రస్తా ఛోడ్, హకీకతోంకె ఘర్ జాయె హం? (జీవితాన్ని మనం కొంచెం ఎందుకు మార్చుకోకూడదూ? కలల దారి వదిలేసి వాస్తవాల గూటికి ఎందుకు చేరగూడదు?)

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News