Friday, November 15, 2024

పిజెపి కాలువపై ఉన్న బ్రిడ్జిలపై పర్యవేక్షణ ఏది?

- Advertisement -
- Advertisement -

శిథిలావస్థకు చేరుకున్న పిజెపి కాలువ బ్రిడ్జిలు
భీంపురం వద్ద కూలిన బ్రిడ్జి

Supervision on bridges of PJP canal
మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి కాలువల మీద నిర్మించిన బ్రిడ్జిలు వంతెనలు నేడు శిథిలాస్థకు చేరుకున్నాయి. ఎన్నో ఏళ్లుగా నిర్మించిన బ్రిడ్జిలు అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. శిథిలావస్థకు చేరుకున్న వంతెనలు ఏళ్ళ తరబడి మరమ్మతులకు నోచుకోలేదు. బ్రిడ్జిలపై నుంచి వాహనాల రాకపోకలు సాగిస్తే ప్రమాదం పొంచి ఉందని అధికారులకు తెలిసినా కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు.

తాజాగా బుధవారం ధరూర్ మండలం భీంపురం గ్రామ శివారులో పిజెపి కాలువపై నిర్మించిన బ్రిడ్జి మీద సామర్థ్యానికి మించి భారీ వాహనం పోవడంతో వంతెన కూలిపోగా.. వాహనం ఇరుకపోయింది. జూరాల ప్రాజెక్టు కుడికాలువ ద్వారా జోగుళాంబ గద్వాల జిల్లాలోని సుమారు 40వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. జిల్లాలోని ఆయా గ్రామాల రవాణ కోసం పిజెపి కాలువల మీద వంతెనలు నిర్మించారు. కొన్ని చోట్ల సామర్థ్యానికి మించిన వాహనాల రాకపోకలు సాగించరాదు. మరికొన్ని చోట్ల భారీ వాహనాల రాకపోకలకు అనుగుణంగా వంతెనలు నిర్మించారు. ఎన్నో ఏళ్లుగా నిర్మించిన వంతెనలపై రక్షణ గోడలు(కల్వర్టులు) ధ్వంసమైనవి. కొన్ని చోట్ల వంతెనపై ఉన్న రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. కంకర తేలి సిసి రోడ్డు మొత్తం దెబ్బతినింది. రక్షణలేని వంతెనలతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రక్షణ లేని వంతెనలు..

ధరూర్ మండలం భీంపురం వద్ద కుడి కాలువ మీద ఉన్న వంతెనపై కల్వర్టులు (రక్షణ గోడలు) లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొగా, తాజాగా అదే బ్రిడ్జిపై సామర్థ్యానికి మించిన భారీ వాహనం వెళ్లడంతో బ్రిడ్జి పూర్తిగా కూలిపోయింది. గద్వాల పట్టణం నదీ అగ్రహారానికి జూరాల కుడికాలువ వంతెనపై రాకపోకలు సాగించాలి. కల్వర్టు (రక్షణ గోడలు) పూర్తిగా ధ్వంసమైనాయి. రాత్రిళ్లు ఈ దారిలో వెళ్లడం ఇబ్బందిగా ఉందని వాహనదారులు ఉందని వాహనదారులు అంటున్నారు. గద్వాల పట్టణంలోని బీరొల్లు రోడ్డులో ఉన్న వంతెనపై కల్వర్టు పడిపోయింది. గద్వాల పట్టణ పరిధిలోని హామాలీ కాలనీ వద్ద ఉన్న కాలువ బ్రిడ్జీ మీద గతంలో భారీ వాహనాల రాకపోకలతో ఇనుప ఊచలు తేలి కంకర రాలిపోవడంతో ప్రజలు భయాందోళనాల మద్య రాకపోకలు సాగిస్తున్నారు. భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో బ్రిడ్జీ కూరకపోయి అట్టడుగు స్థాయికి చేరుకుంది. జాతీయ రహదారి అనంతపురం గ్రామ స్టేజ్ వద్ద కుడికాలువపై భారీ వాహనాల రాకపోకలు సాగించడానికి నిర్మించిన వంతెనకు రక్షణ గోడలు లేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇలా జిల్లాలోని అనేక చోట్ల కుడి కాలువపై ఉన్న వంతెనలపై రహదారులు పాక్షికంగా దెబ్బతినడం, కల్వర్టులు దెబ్బతినడంతో మరమ్మతుల నోచుకోలేదని.. ఇరిగేషన్ అధికారులు నిద్రావస్థలో ఉన్నారని జిల్లా ప్రజలు బహిరంగానే విమర్శిస్తున్నారు. పిజెపి కుడి కాలువల మీద నిర్మించిన బ్రిడ్జీలపై నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు, పిజెపి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు జిల్లా ప్రజలు వాపోతున్నారు. జిల్లాలోని పిజెపి కాలువల మీద ఉన్న వంతెనపై పిజెపి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే బ్రిడ్జీలకు ప్రమాదం వాటిలితున్నాయని, ఉన్నతాధికారులు స్పందించి పిజెపి కాలువ బ్రిడ్జీలను మరమ్మతులు చేయించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. దీనిపై పిజెపి ఇరిగేషన్ అధికారులను వివరణ కోరగా శిథిలావస్తకు చేరుకున్న వంతెనలను గుర్తించి వాటికి మరమ్మతుల చేపడుతన్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా వంతెన మీద ఉన్న రహదారిపై నిర్మించిన రక్షణ గోడలు మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News