సిటీబ్యూరో: వేర్వేరు కేసుల్లో సైబరాబాద్ పోలీసులు భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 910 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.2,80,60,000 ఉంటుంది. నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హర్యానా రాష్ట్రానికి చెందిన జీవన్ సింగ్ నైన్, ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన గోలు అంకిత్ సింగ్ గంజాయి రవాణా చేస్తున్నారు.
వీరికి ఒడిసాకు చెందిన చంద్రశేఖర్, గంజాయి సప్లయ్ చేస్తుండగా, పర్వేజ్ సహకరిస్తున్నాడు. ఇందులో జీవన్, అంకిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జీవన్ సింగ్ డిసిఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డబ్బులు తీసుకుని గంజాయిని డిసిఎంలో మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల్లోని కస్టమర్లకు రవాణా చేస్తుంటాడు. ఈ క్రమంలోనే 2021లో ఎంపిలోని మోతుగూడెం జీవన్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఒడిసాకు చెందిన చంద్రశేఖర్‌తో పరిచయం ఏర్పడింది. గంజాయి మహారాష్ట్రకు సరఫరా చేస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడు, దానికి హైదరాబాద్‌కు చెందిన పర్వేజ్ సహకరిస్తాడని చెప్పాడు.
దానికి అంగీకరించిన నిందితుడు ఒడిసా 758 కిలోల గంజాయిని డిసిఎంలో లోడ్ చేసుకుని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నాడు. గంజాయిని సోలాపూర్‌లో ఇచ్చేందుకు బయలుదేరాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో షాపూర్ సమీపంలో డిసిఎంను బాలానగర్ ఎస్‌ఓటి, జీడిమెట్ల పోలీసులు పట్టుకున్నారు. నిందితులు ఒడిసాలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి షోలాపూర్‌లో కిలోకు రూ.30,000లకు విక్రయిస్తున్నాడు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఓటి ఎడిసిపిలు శోభన్‌కుమార్, నారాయణగౌడ్, ఇన్‌స్పెక్టర్లు,ఎస్సైలు పాల్గొన్నారు.
గాజుల కింద గంజాయి రవాణా….
గాజుల కింద గంజాయి పెట్టి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాజేంద్రనగర్ ఎస్‌ఓటి, శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 144 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.43,20,000 ఉంటుంది. మహార్రాష్ట్రకు చెందిన బాలు, ప్రదీప్ ఫకీరా సిరాసాత్, అనిల్ శ్యాంరావు సాల్వే, భాహు సాహిబ్‌పిరాజీ సాల్వే, కమల్ శివాజీ కాండే, శాంతా భాయి పాండి, మున్నా కలిసి గంజాయి రవాణా చేస్తున్నారు. ఆరుగురు నిందితులు అరెస్టు కాగా మున్నా పరారీలో ఉన్నాడు.
నిందితులు ఒడిసారాష్ట్రంలోని బెహరంపూర్ గ్రామంలో 144 కిలోల గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేశారు. గంజాయిని బ్యాగుల్లో పెట్టుకుని పైన గాజులు పెట్టి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. పైన గాజులు ఉండడంతో ఎవరికీ అనుమానం రాకపోవడంతో ప్రైవేట్ వాహనాల్లో తరలిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో రాజేంద్రనగర్ ఎస్‌ఓటి, శంషాబాద్ పోలీసులు తొండపల్లి వద్ద పట్టుకున్నారు. మరో కేసులో గంజాయి రవాణా చేస్తున్న కర్నాటక రాష్ట్రం, బీదర్‌కు చెందిన శివాజీ కాశీనాథ్ చౌహాన్‌ను మాదాపూర్ ఎస్‌ఓటి, చందానగర్ పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 8కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శివాజీ 2019లో బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి తాపీమేస్త్రీ పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితుడు గంజాయి రవాణా చేస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో మాదాపూర్ ఎస్‌ఓటి ఇన్స్‌స్పెక్టర్ శివకుమార్ తదితరులు పట్టుకున్నారు.