Friday, December 20, 2024

ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నకిలీ మందులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాసిరకమైన, ప్రాణాంతకమైన నకిలీ మందులు సరఫరా చేశారన్న ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు కు ఢిల్లీ లెఫ్టెనెంట్ గవరర్ వికె సక్సేనా సిఫార్సు చేసినట్లు రాజ్‌నివాస్ వర్గాలు శనివారం తెలిపాయి. కాగా దీనిపై ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరబ్ భరద్వాజ్ స్పందిస్తూ , తాను ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొనుగోలు చేసిన మందులపై ఆడిట్‌కు ఆదేశించానని, అయితే ఆరోగ్య వాఖ కార్యదర్శి ఎలాంటి చర్యా తీసుకోలేదని చెప్పారు.ఆరోగ్య శాఖ కార్యదర్శితో పాటుగా దీనితో సంబంధం ఉన్న ఇతర అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఢిల్లీ బిజెపి మాత్రం దీనిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ నాసిరకం నకిలీ మందులను లక్షలాది మంది రోగులకు ఇస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోందని చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్‌కు పంపిన నోట్‌లో లెఫ్టెనెంట్ గవర్నర్ పేర్కొన్నట్లు రాజ్‌నివాస్ అధికార్లు తెలిపారు.

దీనికి సంబంధించిన ఫైలును తాను పరిశీలించానని, లక్షలాది మంది అభాగ్యులైన రోగులకు ఈ నాసిరకం మందులను ఇస్తున్నట్లు తెలిసి తీవ్ర ఆందోళనకు గురయ్యానని సక్సేనా ఆ నోట్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ హెల్త్ సర్వీసెస్ కింద ఉండే ంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ ఏజన్సీ కొనుగోలు చేసిన ఈ మందులను ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రులకు సప్లై చేశారని , వీటిని మొహల్లా క్లినిక్‌లకు కూడా సరఫరా చేసి ఉండవచ్చని లెఫ్టెనెంట్ గవర్నర్ ఆ నోట్‌లో పేర్కొన్నారు. భారీ మొత్తం ఖర్చు చేసి కొనుగోలు చేసిన ఈ మందులు ప్రజల ప్రాణాలకు కూడా ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.ఈ మొత్తం వ్యవహారంలో ఢిల్లీకి చెందిన విభాగాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న తయారీదారులు, సరఫరాదార్ల పాత్ర కూడా ఉండవచ్చని ప్రాథమికంగా అర్థమవుతోందని ఎల్‌జి పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ ఓ నివేదికను కూడా సమర్పించింది.

ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాసిరకం మందులు సరఫరా చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, దరిమిలా ఆస్పత్రులనుంచి సేకరించడం జరిగిందని రాజ్‌నివాస్ అధికారులు తెలిపారు. కాగా తాను ఈ ఏడాది మార్చిలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సిపిఎ ద్వారా కొనుగోలు చేసే మందుల ఆడిట్‌కు ఆదేశించానని, అయితే ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎలాంటి చర్యా తీసుకోలేదని భరద్వాజ్ వరస ట్వీట్లలో తెలిపారు. మరోసారి జులైలో ఆరోగ్య కార్యదర్శి నుంచి యాక్షన్ టేకన్ రిపోర్టును కోరానని, అయితే దానికి కూడా ఆయననుంచి స్పందన రాలేదని పేర్కొన్నారు. దీంతో ఆరోగ్య కార్యదర్శి ఎస్‌బి దీపక్ కుమార్‌ను, డిజిహెచ్‌ఎస్‌ను సస్పెండ్ చేయాలని రెండు నెలలక్రితం లెఫ్టెనెంట్ గవర్నర్‌కు తాను సిఫార్సు చేశానని భరద్వాజ్ పేర్కొంటూ వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

కనీసం ఇప్పుడైనా వారిని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా దీనికి సంబంధించిన వివరాలను తాను చూడలేదని, ప్రభుత్వం దీనిపై పూర్తి వివరాలతో స్పందిస్తుందని అంతకు ముందు విలేఖరులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కూడా అయిన మరో మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News