Monday, December 23, 2024

ఓట్లు చీలకూడదనే కాంగ్రెస్‌కు మద్దతు: షర్మిల

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నాం
వైఎస్‌ఆర్‌టిపి అధినేత్రి షర్మిలా రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయకుండా తప్పుకుంటున్నట్టు ఆ పార్టీ అధినేత్రి షర్మిలారెడ్డి ప్రకటించారు.శుక్రవారం లోటస్‌ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పోటి , పార్టీ పట్ల ప్రజల స్పందన , కార్యకర్తల మనోగతం ,పొత్తులపై చరిపిన చర్చలు తదితర అంశాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించారు. అందరి అభిప్రాయాలను తెలుకున్న షర్మిల తుది నిర్ణయం తీసుకున్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి కాంగ్రెస్‌ను దెబ్బతీయరాదని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారే అవకాశం ఉన్నప్పుడు అడ్డుపడటం సరికాదన్నారు. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం ప్రజల కోసమే అని స్పష్టం చేశారు. కెసిఆర్ ప్రభుతం పట్ల ప్రజలకు తారా స్థాయిలో వ్యతిరేకత ఉందన్నారు. కెసిఆర్ ఓడిపోయేంత చాన్స్ ఉందన్నారు. కెసిఆర్ మీద ఉన్న వ్యతిరేక ఓటును చీల్చొద్దని..మళ్లీ కెసిఆర్ కు అవకాశం ఇవ్వద్దని ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తమను అడగడం జరిగిందని తెలిపారు. ఓటు బ్యాంకు చీలకుండా ఉంటే కాంగ్రెస్ కు ఒక ఛాన్స్ ఉందన్నారు. మీరు దానికి అడ్డు పడవద్దని తమ పార్టీని కోరినట్టు తెలిపారు.వైయస్‌ఆర్ తయారు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, వైయస్‌ఆర్ బిడ్డే కాంగ్రెస్ పార్టీని ఓడించడం సమంజసం కాదని తమనుకోరడం జరిగిందన్నారు.

వైయస్‌ఆర్ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇన్నేండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అటు కర్నాటకలో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇటు తెలంగాణలోనూ కాంగ్రెస్‌పార్టీ గెలిచే అవకాశం ఉందన్నారు. ఇటీవల సోనియా గాంధీ , రాహుల్ గాంధీ తనను ఢిల్లీకి ఆహ్వానించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతి పెద్ద సెక్యూలర్ పార్టీ అని , తెలంగాణ ప్రజల కోసం నిర్ణయం తీసుకుంటున్నాం అని వెల్లడించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు తాను చీలిస్తే ప్రజలు మమ్మల్ని క్షమించరన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వైయస్‌ఆర్ తెలంగాణ పార్టీ మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్‌ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించారు.10 రోజుల ముందు పోటీ చేస్తామని చెప్పామని, కానీ సమయం గడిచే కొద్ది కొన్ని నిర్ణయాలు బలపడుతుంటాయన్నారు. ఈ కొద్ది రోజుల్లోనే మేడిగడ్డ కుంగిపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏమిటో మరొక్కసారి ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. కేటీఆర్ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారని .తమ పార్టీ పోరాటం చేసి లక్ష 90వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేంత వరకు వారికి తెలియదా అని ప్రశ్నించారు.

టీఎస్పీఎస్సీ చాలా ట్రాన్స్ పెరెంట్ గా నడిస్తే ఎందుకు పేపర్ లు లీక్ అయ్యాయని ప్రశ్నించారు. కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావద్దు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం అని వెల్లడించారు. ఇది సులువైన నిర్ణయం కాదన్నారు.తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని అనుకున్నా ఎమ్మెల్యే అవుతానని అనుకున్నా అని తెలిపారు. రాష్ట్రంలో 3,800 కిలోమీటర్ల పాదయాత్రతో పోరాటం చేసిన తర్వాత ఈరోజు తీసుకుంటున్న నిర్ణయం ఇది అని వివరించారు. ఈ నిర్ణయం వైయస్‌ఆర్ తెలంగాణ పార్టీ నాయకులకు చాలా బాధ కలిగిస్తుందన్నారు. తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న త్యాగాన్ని వైయస్‌ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు ఏకీభవిస్తారని నమ్ముతున్నా అని పేర్కొన్నారు.

ఒక వేళ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కొంత మంది తనతో ఏకీభవించకపోతే అటువంటి వారికి తాను క్షమాపణ చెబుతున్నట్టు తెలిపారు.మనం యుద్ధం చేసే సమయం ఇంకా రాలేదని , మనకు కూడా యుద్ధం చేసే సమయం వస్తుందన్న అభిప్రాయంతో ఉండాలని పార్టీ క్యాడర్‌కు సూచించారు. రాజకీయం అంటే ముందు చూపు ఉండాలన్నారు. ఓపిక లేకపోతే రాజకీయాల్లో ఎదగలేమని తెలిపారు. పాలేరు ప్రజలకు ఎన్నికల్లో నిలబడతాను అని తాను మాటిచ్చానని, ఎన్నికల్లో నిలబడాలని కోరిక ఇప్పటికీ ఉందన్నారు. కానీ ఈరోజు పాలేరులో ఉన్న పరిస్థితులు ప్రజలు అర్థం చేసుకోగలరని భావిస్తున్నట్టు తెలిపారు. పాలేరులో కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగిలేటి శ్రీనివాస్ అన్న నిలబడుతున్నారని, పొంగులేటి శ్రీనన్న అంటే తమకు గౌరవం ఉందిన్నారు. 2013లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా తాను 3100కిలోమీటర్ల పాదయాత్ర చేసినట్టు గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా పాదయాత్రలో 500కిలోమీటర్లు తనతోపాటు శ్రీనన్న కూడా నడిచారని తెలిపారు.ఆయన ఎలక్షన్‌లో నిలబడితే అమ్మ క్యాంపేయిన్ చేసిందని తెలిపారు. పాలేరు ప్రజలు నాకు సమాధానం చెప్పాలని , మొండిగా తెగించి పోటీ చేయమంటారా అని ప్రశ్నించారు.

ఎన్నికల్లో గెలుపు ముఖ్యమే అయినప్పటికీ త్యాగం అంతకంటే గొప్పదన్నారు.ఎప్పటికైనా తాను పాలేరులో పోటీ చేస్తా అని వెల్లడించారు. పాలేరులో పోటీ చేయాలన్నది తన బలమైన కోరిక అని షర్మిల పేర్కొన్నారు. పార్టీలో చర్చించి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్‌పార్టీకిమద్దతు ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వివరిస్తూ షర్మిల కాంగ్రెస్‌పార్టీ అధిష్టానానికి, రాహుల్ గాంధీకి లేఖ రాశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News