హైదరాబాద్: బిజెపి వ్యతిరేక పోరాటంలో టిఆర్‌ఎస్‌కు తాము మద్దతిస్తామని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ చెప్పారు. శుక్రవారం నాడు హైదరాబాద్ మగ్దూం భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బిజెపి ప్రయత్ని స్తోందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగంపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. బిజెపికి వ్యతిరేకంగా సాగే పోరాటంలో టిఆర్‌ఎస్‌తో కలిసి పోరాటం చేస్తామని సిపిఐ నేత నారాయణ తేల్చి చెప్పారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై జరిగిన కాల్పుల సంఘటనపై సమగ్ర విచారణ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2022తో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేలా ఈ బడ్జెట్ ఉందని ఆయన విమర్శించారు. ఈ బడ్జెట్‌తో కార్పొరేట్ శక్తులకు మాత్రమే పనికొస్తుందని అన్నారు. వ్యవసాయానికి ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత లేదన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించారన్నారు. నూతన వ్యవసాయచట్టాలను నిరసిస్తూ ఆందోళన చేసిన రైతులపై కోపంతో బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయింపులు చేయలేదని ఆయన విమర్శించారు. బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా కేంద్రం నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. బడ్జెట్‌పై సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను నారాయణ సమర్థించారు.
కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలపై కేంద్రం మొండి వైఖరి: చాడ
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ గుండు సున్న పెట్టిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. కాజీపేట కోచ్ ఏమైందని, కాళేశ్వరం, ప్రాణహితచేవెళ్లకు జాతీయ హోదా డిమాండ్ ప్రస్తావన లేదని విమర్శించారు. తెలుగు రాష్ట్రాలపై కేంద్రం మొండి వైఖరి మంచిది కాదన్నారు.
కేంద్ర బడ్జెట్‌తో నిరుద్యోగం పెరుగుతుంది: సయ్యద్ అజీజ్ పాషా
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ప్రజలకు మరింత కష్టాలు, నష్టాలు వస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా తెలిపారు. నిరుద్యోగం పెరుగుతోందని, కేవలం 60 లక్షల మందికి మాత్రమే ఉద్యోగ కల్పన పొందుపర్చారన్నారు.