Sunday, December 22, 2024

మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి

- Advertisement -
- Advertisement -

సంయుక్త కిసాన్ మోర్చా

మనతెలంగాణ/హైదరాబాద్:  వ్యవసాయ రంగంలో అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు కల్పిచాలని అంతే కాకుండా దీనికి చట్టబద్ధత కూడా కల్పించానలి సయుంక్త కిసాన్‌మోర్చా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం కిసాన్‌మోర్చా నేతలు మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగం పట్ల చూపుతున్న వివక్షను నిరసించారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా డిసెంబర్ 11, 12 తారీకులలో కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించనున్నట్టు వెల్లడించారు.

రైతాంగ ఉద్యమ సమయంలో మోపబడిన కేసులను రద్దు చేయాలని, రైతు నాయకులపై నిర్బంధాలను ఆపాలని, రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ కన్వీనర్లు పశ్య పద్మ, టి. సాగర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక మూడు కేంద్ర చట్టాలను రద్దు చేయాలని ,మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని విద్యుత్తు సవరణ బిల్లు -20 20 రద్దు చేయాలని, రుణమాఫీ చట్టం చేయాలని, తదితర డిమాండ్లతో 13 నెలల పాటు సాగిన రైతు ఉద్యమ సమయంలో 730 మంది రైతులు చనిపోయారని , వేలాది మంది రైతులపై అక్రమ కేసులు మోపబడినాయన్నారు.

మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయడానికి కమిటీ ఏర్పాటు చేస్తామని, రైతు వ్యతిరేక మూడు కేంద్ర చట్టాలను రద్దు చేస్తామని, రైతు సంఘాలతో చర్చించిన మీదటమే విద్యుత్తు సవరణ బిల్లు పై నిర్ణయం తీసుకుంటామని రైతులపై మోపిన కేసుల ను ఎత్తివేస్తామని ఉద్యమాన్ని ఆపాలి అని ప్రధానమంత్రి స్వయంగా చేసిన విజ్ఞప్తిని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వమని రైతు సంఘాలు అడిగాయన్నారు. లిఖితపూర్వకంగా ప్రధానమంత్రి హామీలు ఇవ్వటం వల్లనే తాత్కాలికంగా రైతాంగ ఉద్యమం ఆపివేయడం జరిగిందన్నారు. కానీ నేటి వరకు లిఖితపూర్వకంగా ప్రధానమంత్రి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడానికి పూనుకోలేదని ఆరోపించారు.

ఉద్యమ సమయంలో మోపినటువంటి కేసులకు సంబంధించి తిరగతోడుతూ రైతు ఉద్యమ నాయకులను నిర్బంధించడానికి ప్రయత్నించటం,వారి ప్రయాణాలను మార్గమధ్యంలోనే నిషేధించడం లాంటి దుర్మార్గమైన చర్యలకు కేంద్రపాలకులు పాల్పడుతున్నట్టు వెల్లడించారు. ఈ చర్యలను ఖండిస్తున్నామన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి ఈ విషయాలను విన్నవించుకోవటానికి విజ్ఞాపన పత్రాలను ఇవ్వాలని పిలుపునిచ్చిందన్నారు. డిసెంబర్ 11,12 తేదీలలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ల ద్వారా దేశ రాష్ట్రపతికి మెమోరాండం పంపాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వానికి పిలుపునివ్వడం జరిగిందన్నారు. అక్రమ కేసులు ఎత్తివేస్తామని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలు ప్రకటించాయని , కానీ వాటిని ఇప్పటివరకూ అమలు చేయలేదన్నారు.రైతాంగానికి ప్రధానమంత్రి నాడు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని కిసాన్‌మోర్చా నేతలు పస్య పద్మ,  సాగర్ డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News