Tuesday, January 21, 2025

నిబంధనలతో నష్టపోతున్న రైతాంగం!

- Advertisement -
- Advertisement -

దేశంలో ధాన్యం పండించే రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సేద్య అవసరాలైన విత్తనాల, ఎరువుల, పురుగు మందుల, డీజిల్ ధరల పెరుగుదలతో సేద్యపు ఖర్చులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి. ఉత్పత్తికి కీలకమైన, నాణ్యమైన విత్తనాల సమస్య రైతులను వెంటాడుతున్నది. పండించిన పంటకు మార్కెట్లో న్యాయమైన ధర లభించక, ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర రైతాంగ ప్రయోజనాలకు అనుకూలంగా లేకపోవటం, ప్రభుత్వ సంస్థలు నామమాత్రపు కొనుగోళ్లకే పరిమితం కావటంతో దళారీ మార్కెట్ మాయాజాలంలో చిక్కుకుని రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి సంవత్సరం పంట విస్తీర్ణం, దిగుబడి లక్ష్యం ప్రకటించటం, మద్దతు ధరకు రైతాంగం వద్ద ధాన్యం కొనుగోళ్లు చేస్తామని చెప్పడం, ఆచరణలో నామ మాత్రపు కొనుగోళ్లకే పరిమితం కావటం ప్రభుత్వాల విధానంగా మారింది. ఆనవాయితీగా 2024 సంవత్సరపు ఖరీఫ్ లక్ష్యాలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి.

కొనుగోళ్ల నుంచి తప్పుకున్న కేంద్రం

పంటలకు మద్దతు ధరలు ప్రకటించే కేంద్ర ప్రభుత్వం, ఆ ధర చెల్లించి రైతుల నుంచి పంటలు కొనుగోలుచేయాలి. మద్దతు ధర న్యాయమైన రీతిలో ఉంటేనే, దాని ప్రయోజనం రైతులకు చేకూరుతుంది. ఇప్పటి వరకు ఏ కేంద్ర ప్రభుత్వం అలాంటి మద్దతు ధరలు ప్రకటించలేదు. ఫలితంగా సేద్యం గిట్టుబాటుగాని పరిస్థితి ఏర్పడింది. 2001 వరకు ఎఫ్‌సిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం సేకరణ జరిపేది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలో భాగంగా ఎఫ్‌సిఐని కొనసాగించటం ఇష్టంలేని ప్రధాని మోడీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసే విధానాలు తీసుకున్నది. కనీస మద్దతు ధర చెల్లించి ఎఫ్‌సిఐ కొన్న ధరకు, బహిరంగ మార్కెట్లో అమ్మే ధరకు మధ్య వ్యత్యాసాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎఫ్‌సిఐకి చెల్లించాలి. 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయటం లేదు. బయట సంస్థల నుంచి అప్పులు తెచ్చుకోమంటుంది. కేంద్ర ఇచ్చే సబ్సిడీ అందకపోవటంతో ఎఫ్‌సిఐ అప్పుల్లో కూరుకుపోయింది.

2022 నాటికి దాని అప్పు రూ. 47,339 కోట్లుగా ఉంది. ముందుముందు మద్దతు ధర పెరుగుదలతో సబ్సిడీ భారీగా చెల్లించాల్సి వస్తుందని భావించి దాన్ని వదిలించుకోవాలని మోడీ ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా ఎఫ్‌సిఐకి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ధాన్య సేకరణ నుంచి ఎఫ్‌సిఐ తప్పుకుని తన అవసరాల మేరకు రాష్ట్రాల నుంచి బియ్యం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ధాన్య సేకరణ నుంచి తప్పుకోవటంతో ధాన్య సేకరణ బాధ్యత రాష్ట్రాలు చేపట్టాయి. మోడీ ప్రభుత్వం రాష్ట్రాల నుంచి బియ్యం తీసుకోవడంలోనూ వివక్ష చూపుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో 2023- 24 ఖరీఫ్ సీజన్‌లో 65 లక్షల ఎకరాల్లో వరి సేద్యం జరిగిందని, కోటి నాలుగు లక్షల టన్నుల ధాన్య ఉత్పత్తి జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

ఇందులో సగం ధాన్యం మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తారని, కొంత ధాన్యాన్ని తమ వద్దే రైతులు నిల్వ ఉంచుకుంటారని, 70 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌరసరఫరాల సంస్థ అంచనా వేసింది. సేకరణ మాత్రం 50 లక్షల టన్నులకే పరిమితమైంది. ధాన్య సేకరణలో ప్రభుత్వ సంస్థల నిబంధనలు రైతాంగంలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. తేమ శాతం, తాలు గింజలు, మట్టి, తడిచిన ధాన్యం పేరుతో మద్దతు ధరలో తగ్గిస్తున్నాయి. విక్రయించటానికి రోజుల తరబడి కొనుగోళ్ల కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులకు విసుగు చెందిన రైతులు ప్రైవేట్ మార్కెట్లో ధాన్యాన్ని అమ్ముకొంటున్నారు.

తెలంగాణలో 1,157 ప్రభుత్వ గోదాములు ఉన్నాయి. వీటి సామర్ధ్యం 25.4 లక్షల టన్నులు. దాదాపు కోటి టన్నుల దాకా ధాన్యం నిల్వకు గిడ్డంగులు లేవు. వ్యవసాయ శాఖ గిడ్డంగుల్లో కొన్ని ప్రైవేట్ వ్యక్తులకు అద్దెకు ఇచ్చారు. 20 లక్షల టన్నుల బియ్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన గిడ్డంగులు కేటాయించాలని వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఇది ఎలా ఉందంటే, ఉన్నవాటిని ఇతరులకు కట్టబెట్టి, లేని వాటి కోసం వెతుకులాటగా ఉంది. వ్యవసాయ శాఖలో ఉన్న కొన్ని మార్కెట్ కమిటీ గోదాములు, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇవి ఏమాత్రం సరిపోవు.

ప్రతి సీజన్‌లో వరి కోతలకు ముందే ఆయా జిల్లాల్లో వచ్చే దిగుబడులను సీ ఎంఆర్ (కష్టమ్ మిల్లింగ్ రైస్)కోసం జిల్లాలవారీగా మిల్లులకు కేటాయిస్తారు. 2023-24 సీజన్‌లో అలా జరగలేదు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించకూడదని పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వచ్చింది వచ్చినట్లే ప్రభుత్వ సంస్థల, శాఖల పరిధిలోనే నిల్వచేయాలని చెప్పింది. దీనికి వ్యవసాయ శాఖ ఆమోదం తెలిపింది. కారణం మిల్లు యజమానులు కొన్ని డిమాండ్లు పెట్టడమే. సన్న ధాన్యం మిల్లింగ్ 67% బియ్యం రావని, నిబంధనలు మార్చాలని, రైతులు ఇచ్చే ధాన్యంలో తేమశాతాన్ని 17 నుంచి 14 శాతానికి తగ్గించాలని, బియ్యం సరఫరాలో క్వింటాలుకు రూ. 300 పరిహారం, కస్టోడియన్, మిల్లింగ్, రవాణా చార్జీలు పెంచాలని ఆ డిమాండ్లుగా ఉన్నాయి.

ప్రభుత్వ అందుకు అంగీకరించలేదు. తేమ తగ్గించమన్న డిమాండ్ మాత్రం రైతాంగానికి నష్టం చేస్తుంది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మిల్లింగ్ చార్జీలు నామ మాత్రంగానే ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో క్వింటాలు మిల్లింగ్‌కి రూ. 110 నుండి రూ. 200పైగా ఇస్తుంటే, తెలంగాణలో మాత్రం పది రూపాయలే ఇస్తున్నారు.కనీసం రూ. 100 ఇవ్వాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం దొడ్డు ధాన్యానికి రూ. 40, సన్నాలకు రూ. 50 లుగా నిర్ణయించింది. 2024 -25 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 146.70 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని తాజా అధికార లెక్కలు తెలుపుతున్నాయి. అందులో 80 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుంది. ప్రతి మిల్లరు సిఎంఆర్‌లో పాల్గొనేలా, మిల్లుల్లో కనీసం 50 శాతం ప్రభుత్వ ధాన్యం ఉండేలా 2023 నవంబర్ లో జిఒ విడుదలైంది.

దాన్ని ఈ సీజన్‌లో అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోలు కేంద్రాలకు పంపే ధాన్యం లోడులను దించుకోని మిల్లులు, మిల్లర్లపై కఠిన చర్యలకు సిద్ధం అయింది. ధాన్యం తీసుకోని మిల్లుల్ని సీజ్ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. తమ డిమాండ్లు నెరవేరే వరకు ధాన్యం లోడ్లు దించుకోమని మంత్రి వర్గ ఉప సంఘానికి కొందరు మిల్లర్లు తెలిపారు. ప్రభుత్వ, మిల్లర్ల వివాదం వల్ల రైతులకు ఇబ్బందులు వస్తాయి. మిల్లులు ధాన్యాన్ని దించుకోకపోతే నిల్వ చేయటానికి గోదాముల కొరత పేరుతో రైతుల నుంచి ధాన్య కొనుగోళ్లు ఆగే పరిస్థితి ఏర్పడుతుంది. నూర్చి ఎండబెట్టిన ధాన్యాన్ని గ్రామ కొనుగోళ్ల సెంటర్లకు రైతులు తీసుకుని వెళ్లగా వడ్లలో మట్టి, చెత్త, తాలు పేరుతో 40 కేజీల సంచికి అదనంగా రెండు కేజీలు తీసుకుంటున్నారు.

గ్రామ కొనుగోలు కేంద్రాలు కొన్న ధాన్యాన్ని మిల్లులకు పంపగా మరలా మట్టి, తాలు, నూక పేరుతో నాలుగు కేజీల పైగా అదనంగా ఇవ్వాలంటున్నారు. దీనికి తోడు హమాలీల ఎత్తుడు, దింపుడు కూలీ కూడా రైతులే భరించాలి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా ముతక ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఎందుకంటే బయట మార్కెట్లో ఆ ధాన్యానికి మద్దతు ధర కూడా లభించటం లేదు. ప్రభుత్వం సన్న ధాన్యాలకు మాత్రమే రూ. 500 వందల బోనస్ ప్రకటించింది. బయట మార్కెట్లో సన్న ధాన్యానికి మద్దతు ధర కన్నా ఎక్కువ ధర లభిస్తున్నది. దీన్ని గమనించి ప్రభుత్వ సంస్థలు దొడ్డు ధాన్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేయాలి. ప్రభుత్వం అలా చేస్తుందనే నమ్మకం లేదు. రైతుల నుంచి ధాన్యం సేకరణకు రాష్ట్రంలో 7,250 కొనుగోలు కేంద్రాలు అవసరమైతే, ఇప్పటి వరకు 2,600 కేంద్రాలు మాత్రమే ప్రారంభమైనాయి. మార్కెట్ సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా కనీసం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు, యంత్రాలు, పరికరాలు లేక రైతులు నానాఇబ్బందులు పడుతున్నారు.

ఎఫ్‌సిఐని ధాన్యసేకరణ నుంచి తప్పించడం, రైతాంగ ప్రయోజనాలకు అనుగుణంగా పంటలకు న్యాయమైన మద్దతు ధరలు ప్రకటించకపోవటం, మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేయటం, ధాన్యం కొనుగోళ్లకు నిబంధనలు ప్రకటించటం, మద్దతు ధరలకు చట్టబద్ధత నిరాకరించటం, కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించకపోవటం, సేద్యాన్ని నష్టదాయకంగా మార్చటం బడా వ్యాపారుల, కార్పొరేట్ సంస్థల ప్రయోజనం కోసమే. రైతాంగం సేద్యం నుంచి తప్పుకునేలా చేయటమే. మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతులందరూ ఉద్యమించాలి. నిబంధనలు సడలించి ధాన్యసేకరణ చేయాలని, దొడ్డు ధాన్యానికి కూడా 500 రూపాయల బోనస్ ప్రకటించాలని, మిల్లర్ల దోపిడీ అరికట్టాలని, వ్యవసాయంలో కార్పొరేట్ సంస్థల ప్రవేశాన్ని అరికట్టాలని డిమాండ్ చేయాలి.

బొల్లిముంత
సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News