ఖరీఫ్ పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు ద్రవ్యోల్బణం తగ్గించేందుకు తోడ్పడుతా యని ఆర్థిక వేత్తలు స్పందించారు. ఎన్నికల సంవత్సరంలో ధరలు పెరగకుండా, తద్వారా బిజెపికి జనం దూరం కాకుం డా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు లో భాగమే ఇది. రైతులకు మేలు చేసేది కాదు అని వేరే చెప్పనవసరం లేదు. సావిత్రీ నీపతి ప్రాణంబు దక్క వరాలు కోరుకోమన్నట్లుగా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధ్దత కల్పించటం మినహా రైతులు ఏమైనా కోరుకోవచ్చని ఏడాది పాటు సాగిన రైతుల ఆందోళన సందర్భంగా బిజెపి నేతలు చెప్పారు. విధిలేని పరిస్థితిలో ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి క్షమాపణలు చెప్పి మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించారు. కనీస మద్దతు ధరల గురించి సిఫార్సు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మద్దతు ధరలను సిఫార్సు చేసేందుకు బిజెపి అధికారానికి రాక ముందు నుంచే ఒక వ్యవస్థ ఉంది. ఆ విధానానికి చట్టబద్ధత కల్పించాలని రైతులు కోరుతున్నారు,
సిఎంగా ఉన్నపుడు నరేంద్ర మోడీ కూడా డిమాండ్ చేశారు. ఇప్పుడు కాదు పో పొమ్మికన్ అన్నట్లుగా రైతుల పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. వేసిన కమిటీలో అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారు, మూడు సాగు చట్టాలను రూపొందించిన పెద్దలే ఉన్నందున తామా కమిటీని బహిష్కరిస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ప్రకటించిం ది. తరువాత గత ఏడాది కాలంగా ఆ కమిటీ ఏం చేస్తున్నదో, ఏం చెబుతుందో తెలియదు. రైతుల ఆదాయాలను 2022 నాటికి రెట్టింపు చేస్తామన్న నరేంద్ర మోడీ బాసల గురించి మన్‌కీబాత్‌లో కూడా మాట్లాడేందుకు నోరు రావటం లేదు. తమ ప్రభుత్వ హయాంలో 2014 15లో ఏ గ్రేడ్ వరి మద్దతు ధర రూ. 1,400 నుంచి 2023 24లో రూ. 2,203కు అంటే రూ. 803 పెంచినట్లు మోడీ సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్నది. సగటున వార్షిక పెంపుదల 5.7 శాతం. అంతకు ముందు కాంగ్రెస్ ఏలుబడి లో 2004 05 రూ. 590 నుంచి రూ. 1,400కు పెరిగింది. రూ. 810 పెరిగింది. సగటు వార్షిక పెరుగుదలలో చూస్తే 14 శాతం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి గణనీయంగా సాగు చేస్తారు.
కాంగ్రెస్ ఏలుబడిలో పొడవు పింజ పత్తి ధర రూ. 1,760 నుంచి రూ. 4,050 పెరిగింది. నిఖర పెరుగుదల రూ. 2,290 వార్షిక సగటు 13 శాతం. అదే నరేంద్ర మోడీ కాలంలో రూ. 4050 నుంచి రూ. 7,020కి పెంచారు. నిఖర పెరుగుదల రూ. 2,970 కాగా వార్షిక సగటు 7.3 శాతమే. ఎవరు రైతులకు మేలు చేసినట్లు? దీని అర్ధం కాంగ్రెస్ రైతులను ఏదో ఉద్ధరించిందని చెప్పటం కాదు, పెరిగిన సాగు ఖర్చులతో పోలిస్తే అది కూడా తక్కువే. దానితో పోలిస్తే మంచి రోజులను తెచ్చి అమృతకాలంగా మార్చి రైతుల రాబడి రెట్టింపుచేస్తామన్న నరేంద్ర మోడీ పాలనలో మరింత దిగజారింది అని చెప్పేందుకే ఈపోలిక. అంకెలన్నీ మన ముందు న్నాయి. ఎవరికి వారు పోల్చి చూసుకోవచ్చు.
కనీస మద్దతు ధరలను పెంచితే దాని ప్రభావం బియ్యం, వస్త్రాలు, దుస్తుల ధరల పెరుగుదలకు దారి తీస్తుంది కదా అని ఎవరైనా వాదించవచ్చు. రైతులు గొంతెమ్మ కోరికలను కోరటం లేదు. సాగు గిట్టుబాటు కావాలి వినియోగదారులకు సరసమైన ధరలకు అందుబాటులో ఉండాలి.పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల ధరలను స్థిరంగాఉంచితే రైతులు కూడా మద్దతు ధరల పెంపుదలను అడగరు. అన్నింటికీ మించి ఎవరేమి చెప్పినా రైతు బతకాలి, సాగు సాగాలి. అందుకే కదా రైతుల రాబడిని రెట్టింపు చేస్తామని మోడీ సర్కార్ చెప్పింది. దాన్ని అమలు జరపమనే కదా రైతులు అడుగుతోంది. ఎన్నికలు జరిగే సంవత్సరంలో ధరలను కాస్త ఎక్కువగా పెంచటం గతంలో కాంగ్రెస్ చేసింది. సేవ్‌ు టు సేవ్‌ు అదే జిమ్మిక్కు నరేంద్ర మోడీ కూడా కొనసాగిస్తున్నారు. ఉదాహరణకు 2014 15 నుంచి 2017 18వరకు మూడు సంవత్సరాల్లో ఏ గ్రేడ్ వరికి పెరిగింది మొత్తం రూ. 190 మాత్రమే, సగటున ఏడాదికి రూ. 63 మాత్రమే. అదే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 2018 19లో పెంచిన మొత్తం రూ. 180. తరువాత
నాలుగు సంవత్సరాల్లో రూ. 1,770 నుంచి 202223 వరకు రూ. 2,060కి అంటే రూ. 290. ఏడాదికి సగటున రూ. 72.50 కాగా, వచ్చే ఏడాది ఎన్నికల కారణంగా ఈసారి రూ. 143 పెంచారు. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి వార్షిక ద్రవ్యోల్బణ ప్రాతిపదికన నామమాత్రంగా పెంచుతున్నారు తప్ప సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకోవటం లేదు. మరోవైపు మార్కెట్లో గోధుమలు, బియ్యం ధరల పెరుగుదల కనీస మద్దతు ధరల కంటే ఎక్కువగా ఉంటున్నది. దీనికి కారణం ఏమిటో ఎవరూ చెప్పరు. ప్రతిదానికీ ఉక్రెయిన్ సంక్షోభం అని చెప్పి తప్పించుకుం టున్నారు. అది ప్రారంభంగాక ముందే మన దేశంలో ధరల పెరుగుదల మొదలైందన్నది చేదు నిజం. ప్రతి ఆరు నెలలకు ఒకసారి దానికి అనుగుణంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఉద్యోగులకు కరవు భత్యం పెంచటమేదానికి తిరుగులేని నిదర్శనం.
2021 నవంబరు 19వ తేదీన నరేంద్ర మోడీ దేశమంతటికీ క్షమాపణలు చెప్పి మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నట్లు చెప్పారు. వాటిని అమలు జరిపితే రైతుల కష్టాలు తీరుస్తాయన్నారు.
వాటిని రద్దు చేసిన తరువాత ఇంత వరకు వాటి బదులు కష్టాలు తీర్చే చర్యలేమీ తీసుకోలేదు. అంటే తాను చెప్పినట్లు వినలేదు గనుక రైతులకు ఒక పాఠం చెప్పాలని మోడీ నిర్ణయించుకున్నట్లు కనిపి స్తోంది. ప్రజాస్వామ్యానికి నిబద్ధులై ఉండేవారి లక్షణం కాదిది. వెంటవెంటనే నిర్ణయాలు తీసుకోవటంలో తమకు తామే సాటి అని చెప్పుకొనే వారు సాగు చట్టాల రద్దు తరువాత ఐదు నెలలకు ఒక కమిటీని వేశారు.ఆ కమిటీ పరిధి ఏమిటి? ఏ అంశాలను అది పరిశీలిస్తుందో వివరించాలని రైతు ఉద్యమం నడిపిన సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదు. అందువలన ఆ కమిటీలో ఉండి చేసేదేమీ లేదు గనుక ప్రతినిధుల పేర్లను ప్రతిపాదించటం లేదని స్పష్టం చేసింది. ఈ కమిటీ చైర్మన్ ఎవరంటే రైతులు తిరస్కరించిన మూడు సాగు చట్టాలను రచించిన వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి సంజయ అగర్వాల్. ఆ చట్టాలను ఎలా రూపొందించాలో సలహా ఇచ్చిన నీతిఅయోగ్ సభ్యులు రమేష్ చాంద్. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించకూడదని చెప్పిన ఆర్థికవేత్తలను నిపుణుల పేరుతో చేర్చారు.
ప్రభుత్వ ప్రతినిధులు సరేసరి, వీరుగాక రైతుల ఆందోళనను వ్యతిరేకించిన ఐదు సంఘ పరివార్ సంఘాలకు చెందినవారిని చేర్చారు. ఆందోళనకు నాయ కత్వం వహించిన వారిని మూడు పేర్లు ఇవ్వాలని కోరారు. నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి ఈ ముగ్గురూ ఆ కమిటీలో ఉండి చేసేదేమీ ఉండదు. పోనీ వీరు లేకుండా ఇప్పటి వరకు కమిటీ చేసిందేమిటి అంటే నాలుగు ఉపసంఘాల ఏర్పాటు తప్ప మరేమీ లేదు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత ప్రతిపాదన ప్రస్తావన లేని కమిటీ ఇది. రైతుల రాబడి రెట్టింపుకు మూడు సాగు చట్టాలే ఆక్సిజన్ అని చెప్పారు. ఇంతవరకు వాటి బదులు ఏం చేస్తారో చెప్పలేదు. రైతులను నట్టేట ముంచినట్లేనా !
మూడు సాగు చట్టాలను అమలు జరపకుండా 2022 నాటికి రైతుల రాబడిని రెట్టింపు చేయటం కుదరదని నీతిఅయోగ్ సభ్యులు రమేష్ చాంద్ రైతుల ఆందోళన సమయంలో చెప్పారు. రాష్ర్ట ప్రభుత్వాలు అమలుకు అవసరమైన మేరకు చర్యలు కూడా తీసుకోలేదని అన్నారు. అసలు రాష్ట్రాలతో సంప్రదించకుండా సాగు చట్టాలను రుద్దారు. నీతిఅయోగ్ సిఫార్సులు చేయటం తప్ప వాటిని కేంద్రమే పట్టించుకోదు. తమ ప్రభుత్వం అమలు జరుపుతున్న స్కీంలతో రైతులరాబడి పెరుగుతున్నదని కేంద్ర ప్రభుత్వం నమ్మించ చూస్తున్నది.2021లో పార్లమెంటు చర్చల్లో కేంద్ర ప్రభుత్వం ఇవిగో తమ పథకాలంటూ 17తో ఒక జాబితాను అందించింది, వాటికి గాను రూ. 17,540 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పింది. 202021 సంవత్సరానికి గాను వాటికి కేటాయించిన బడ్జెట్‌లో మూడో వంతు అంటే రూ. 5,787 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
వాటిలో మూడు పథకాలకైతే ఒక్క పైసా కూడా ఖర్చు లేదు. అంతేకాదు మొత్తం ఖర్చు చేసినప్పటికీ కేవలం 10% మంది రైతులకే ఈ పథకాలు అమలు అవుతాయని కూడా కేంద్రమే చెప్పింది. మోడీ సర్కార్ అమలు జరుపుతున్న పిఎం కిసాన్ పథకంలో ఏడాదికి రూ. ఆరు వేల చొప్పున ఇస్తున్నది కేవలం 10.74 కోట్లు లేదా 10 శాతం మంది రైతులకే. అంటే దీని ద్వారా కుటుంబానికి అదనపు రాబడి నెలకు రూ. 500 మాత్రమే. 2022 నాటికి రైతుల రాబడిని రెట్టింపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఇటీవలి కాలంలో ఎక్కడా దాని గురించి మాట్లాడటం లేదు. 2016 ఏప్రిల్లో మంత్రులతో ఒక కమిటీని వేశారు. 2018 సెప్టెంబరులో అది ఒక నివేదికను ఇచ్చింది. దానిలో ఏడు అంశాల ను పేర్కొన్నారు. 1. పంటల ఉత్పాదకత పెంపుదల 2. పశువుల ఉత్పాదకత పెంపుదల, 3. వనరులను సమర్ధవంతంగా వినియోగిం చటం, ఉత్పత్తి ఖర్చు తగ్గింపు, 4. పంటల సాంద్రతను పెంచటం, 5. అధిక విలువనిచ్చే పంటల వైపు మళ్లింపు 6. రైతుల పంటలకు గిట్టుబాటు ధర 7. అదనంగా ఉన్న మానవ వనరులను వ్యవసా యేతర రంగాలకు మళ్లించటం. వీటి ఏ ఒక్క అంశంలోనైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధి ఏమిటో ఎక్కడా మనకు కనిపించదు.
కేంద్రం ప్రభుత్వం జూన్ 7న ప్రకటించిన మద్దతు ధరల్లో ఒక్కటంటే ఒక్క పంటకు కూడా స్వామినాథన్ కమిషన్ సూచించిన సి2 ప్లస్ 50 ప్రకారం ధరలను ప్రకటించటం లేదు. అఖిల భారత కిసాన్ సభ వంటి రైతు సంఘాలు కేంద్రం మోసాన్ని ఆధార సహితంగా నిరూపించాయి. ధాన్యానికి క్వింటాలకు రూ. 2183, జొన్నకు రూ. 3180, కందికి రూ. 7000, పత్తికి రూ. 6620 చొప్పున కేంద్రం ఎంఎస్‌పి ప్రకటించింది. కానీ సి2 ప్లస్ 50 పర్సెంట్ ప్రకారం ధాన్యానికి క్వింటాలుకు రూ. 2866.5, జొన్నకు రూ. 2833, కందికి రూ.8 989.5, పత్తికి రూ. 8679 ప్రకటించాలి. ఆ మేరకు రైతులు నష్టపోతున్నారు. రైతు వ్యవసాయ ఖర్చులు, ధరల కమీషన్ (సిఎసిపి) అంచనాల కంటే ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, కేరళ, మహారాష్ర్ట, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల పెట్టుబడులు అధికంగా ఉంటున్నాయి.
జాతీయ సగటు కంటే అధికంగా ఎంఎస్‌పి ఇచ్చామంటున్నారు. ఎక్కువ ఖర్చు ఉన్న చోట రైతుల నష్టాన్ని ఎవరు భరించాలి? వరిసాగు ఖర్చు (సి2) క్వింటాలకు కనీసం తెలంగాణలో రూ. 3300, ప్రకటించిం ది రూ. 2,183 మాత్రమే. ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే విధమైన తేడాలు ఉన్నాయి. రైతుల రాబడిలో కూడా ఒక రాష్ట్రానికి ఒక రాష్ర్టంతో పొసగదు. అందువలన సగటు లెక్క అనేది అశాస్త్రీయం. కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక విధానాలను అమలు జరుపుతున్నట్లే సాగు ఖర్చు ఎక్కువగా ఉన్న చోట రైతును ఆ మేరకు ఆదుకోవాలి.