ఈ కార్ రేసు కేసులో హైకోర్టు ఉత్తర్వులపై కెటిఆర్‌కు సుప్రీం స్పష్టీకరణ
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్‌కు సుప్రీంకోర్టులోనూ ఎదురు దెబ్బతగిలింది. హైకోర్టు ఆదేశాలపై తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. ఫార్ములా ఈ రేసు కేసులో పూర్తి స్థాయి విచారణ జ రగాలని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో సుప్రీంకోర్టులోనూ కెటిఆర్‌కు నిరాశ ఎదురయింది. పూర్తి స్థాయి విచారణ జరిగితేనే ఈ విషయంలో వాస్తవాలు వెలుగు చూస్తాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కెటిఆర్ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఫార్ములా – ఈ కారు రేసింగ్ కేసులో ఆయన ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కెటిఆర్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎసిబి నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ కెటిఆర్ తొలుత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, అందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆయన సుప్రీంకోర్టు లో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేశారు. కెటిఆర్ పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం వి చారణ చేపట్టింది. దీంతో కెటిఆర్ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు
నేడు ఇడి ఎదుట కెటిఆర్ హాజరు
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ గురువారం హాజరు కానున్నారు. ఉదయం 10.30 గంటలకు ఇడి కార్యాలయానికి వెళ్లనున్నారు. నందినగర్ నివాసం నుంచి 10 గంటలకు కెటిఆర్ బయల్దేరనున్నారు. తర్వాత ఎసిబి అధికారులు విచారణకు పిలిచే అవకాశముంది. ఇప్పటికే కెటిఆర్‌ను ఒకసారి విచారించిన ఎసిబి అధికారులు మరొకసారి విచారణ కు రమ్మని నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయని అధికారుల ద్వారా తెలిసింది. అయితే ఈ వారంలోనే కెటిఆర్‌కు సమన్లు ఇవ్వాలని ఎసిబి అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.
ఫార్ములా – ఈ కారు రేసింగ్ కేసులో రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించారని ఆయనపై ఇటు ఎసిబి, అటు ఇడి అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ రూ.55 కోట్లు తిరిగి బిఆర్‌ఎస్ పార్టీ ఎలక్ట్రోరల్ బాండ్లను కొనుగోలు చేసిందని, క్విడ్ ప్రోకో జరిగిందని కూడా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు మంత్రి మండలి ఆమోదం లేకుండానే ఈ రూ.54 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించడం వెనక అవినీతి జరిగిందని కూడా ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు ఎసిబి, ఇడిలు సిద్ధమయ్యా యి. ఎసిబి ఇప్పటికే ఒకసారి విచారణచేసి కొన్ని వివరాలను సేకరించింది.