హైదరాబాద్: పైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నవంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన లాయర్ సిద్ధార్థ లూథ్రా అభ్యర్థన మేరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ప్రకటించింది. అప్పటి వరకు గతంలో ఇచ్చిన అండర్ టేకింగ్ కొనసాగించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమయ్యాక చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే మూడు ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేయగా ఒక దానిపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసిందని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
ఈ క్రమంలో విచారణను వాయిదా వేయాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై ప్రభుత్వ లాయర్ స్పందిస్తూ కస్టడీలో ఉన్న వ్యక్తికి సంబంధించి అరెస్టు అనే ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పారు. ఆ కేసులోనూ జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతుందని కోర్టుకు తెలిపారు. ఇదే విషయాన్ని తాము దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లోనూ పేర్కొన్నట్లు వివరించారు. దీంతో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. పైబర్ నెట్ కేసులో మిగతా అందరికీ బెయిల్ మంజూరు చేసిన ఎపి హైకోర్టు చంద్రబాబు పిటిషన్‌ను మాత్రం తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను శుక్రవారం విచారణకు రాగా జస్టిన్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఏం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
చంద్రబాబు లీగల్ ములాఖత్‌ల పెంపునకు నో చెప్పిన ఎసిబి కోర్టు
టిడిపి అధినేత చంద్రబాబుతో ములాఖత్ విషయంలో ఆయన లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను ఎసిబి కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆయనను కలిసేందుకు లాయర్లకు రోజుకు ఒకసారి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారని, కనీసం మూడు సార్లు అవకాశమివ్వాలని చంద్రబాబు లాయర్లు కోర్టును కోరారు. ఎసిబి కోర్టు, ఎపి హైకోర్టు, సుప్రీంకోర్టులలో పలు కేసులపై విచారణ జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబును కలిసి చర్చించేందుకు రోజుకు మూడు సార్లు అవకాశం కల్పించాలని కోరారు. కనీసం 45 నుంచి 50 నిమిషాల పాటు చర్చించేందుకు అనుమతించేలా జైలు అధికారులను ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో చంద్రబాబును కలిసేందుకు రోజుకు రెండుసార్లు లీగల్ ములాఖత్ కు అవకాశం కల్పించారని చెప్పారు. అయితే, ప్రస్తుతం దీనిని రోజుకు ఒకసారికి కుదించారని చెప్పారు. లీగల్ ములాఖత్ పై చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన ఎసిబి కోర్టు పిటిషన్‌లో ప్రతివాదుల పేర్లను చేర్చలేదనే కారణంతో విచారణకు తిరస్కరించింది. ఈ పిటిషన్‌పై ప్రస్తుతం విచారించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.