మార్చి 4కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
మన తెలంగాణ/హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎల వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన తమ పది మంది ఎంఎల్‌ఎలను అనర్హులుగా ప్రకటించాలంటూ బిఆర్‌ఎస్ పార్టీ వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి విదితమే. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా రీజనబుల్ టైం అంటే ఎంతో కచ్చితంగా చెప్పాలంటూ తెలంగాణ స్పీకర్‌ను కోరింది. ఫిరాయింపు ఎంఎల్‌ఎలపై చర్యల కోసం రీజనబుల్ టైం కోసం స్పీకర్ ఎదురు చేస్తున్నారని అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి మరోసారి సుప్రీంకోర్టుకు వెల్లడించారు. అయితే సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బిఆర్‌ఎస్ వాదించింది. ఈ నేపథ్యంలో ఆ రీజనబుల్ టైం ఎంతో చెప్పాలంటూ కోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నిస్తూ విచారణ వాయిదా వేసింది.
మార్చి 4వ తేదీన బిఆర్‌ఎస్ పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం మరోసారి విచారించనుంది. ఎంఎల్‌ఎలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు సహా 10 మంది విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్ వేశారు. అలాగే, ఎంఎల్‌ఎలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి ద్విసభ్య ధర్మాసనం విచారిస్తోంది. ఆ పది మంది ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వేసేలా తెలంగాణ స్పీకర్‌ను ఆదేశించాలని బిఆర్‌ఎస్ సుప్రీంకోర్టును అభ్యర్థిస్తోంది. ఈ క్రమంలో గత వాదనల్లో తెలంగాణ స్పీకర్ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి విదితమే.
తగిన సమయం, సరైన సమయం అంటూ స్పీకర్ చెబుతూ కాలయాపన చేయడంపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర తరహాలో ఎంఎల్‌ఎల పదవీకాలం ముగిసేదాకా ఆగుతారా? అంటూ ఆగ్రహాన్ని కనబర్చింది. ఈ పిటిషన్లపై పూర్తి వాదనలు విన్నాకే ‘ఆ సరైన సమయం’పై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే స్పీకర్‌కు సూచనలు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిబంధనల ప్రకారం పార్టీ మారిన ఎంఎల్‌ఎలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారని గత విచారణలో అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు వెల్లడించారు. అయితే సుప్రీంకోర్టు జోక్యం తర్వాతే స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయని బిఆర్‌ఎస్ అంటోంది. కాగా, పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే తామే కలుగజేసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానిస్తూ విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.