Thursday, January 23, 2025

నీట్ గ్రేస్ మార్కులు రద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎంబిబిఎస్, బిడిఎస్, ఇతర వైద్య కోర్సుల అడ్మిషన్ల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) యుజి,2024 రాసిన 1,563 మంది అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని రద్దు చేశామని, జూన్ 23న మరోసారి నిర్వహించే పరీక్షలో ఆ వి ద్యార్థులు పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నామని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. గ్రేస్ మార్కులు ఇచ్చిన అభ్యర్థులు మరోసారి పరీక్షను రాసే అవకాశాన్ని కల్పిస్తున్నామని కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపా రు. కాగా..అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియపై స్టే ఇవ్వలేమని పిటిషనర్లకు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. జూన్ 23న మరోసారి నిర్వహించే పరీక్షలో పాల్గొనలేమని

ఆ 1,563 మంది విద్యార్థులు భావిస్తే గ్రేస్ మార్కులు మినహాయించి వారికి వచ్చిన అసలు మార్కులను విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. మరోసారి నిర్వహించే పరీక్ష ఫలితాలను జూన్ 30న ప్రకటిస్తామని, ఎంబిబిఎస్, బిడిఎస్, ఇతర కోర్సుల కౌన్సెలింగ్ జులై 6న ప్రారంభమవుతుందని కేంద్రం తెలిపింది. కేంద్రం ఇచ్చిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం గ్రేస్ మార్కులు ఇవ్వడడంతోపాటు ఇతర అంశాలపై పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను జులై 8న విచారిస్తామని తెలిపింది. ప్రశ్నాపత్రం లీకేజీ, ఇతర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న పిటిషనర్లు నీట్ యుజి, 2024 పరీక్షను రద్దు చేయాలని కోరుతున్నారు. ఎడ్‌టెక్ సంస్థ ఫిజిక్స్ వాలా చీఫ్ ఎగ్జిక్యుటివ్ అలఖ్ పాండేతోసహా పలువురు నీట్‌యుజి, 2024పై పిటిషన్లు దాఖలు చేశారు. కాగా..దేశవ్యాప్తంగా 4,750 సెంటర్లలో నీట్ పరీక్షను మే 5న ఎన్‌టిఎ నిర్వహించింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.

జూన్ 14న ఫలితాలను ప్రకటించ వలసి ఉండగా ముందుగానే జూన్ 4న విడుదల చేశారు. జవాబు పత్రాల మూల్యాంకనం ముందుగానే పూర్తయిన కారణంగా ఫలితాలను ముందుగానే ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రం లీకేజి, 1500 మందికి పైగా అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడంపై విద్యార్థుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. వివిధ హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్‌టిఎ చరిత్రలోనే మొట్టమొదటిసారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. వీరిలో ఆరుగురు విద్యార్థులు హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఒకే కేంద్రంలో పరీక్ష రాసినవారే కావడంతో పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్థులు జూన్ 10న ఢిల్లీలో నిరసన తెలిపారు. గ్రేస్ మార్కులు కలపడం వల్లనే 67 మంది విద్యార్థులు టాప్ ర్యాంకు సాధించారని వారు ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్, బిడిఎస్, ఆయుష్, ఇతర సంబంధిత కోర్సులలో అడ్మిషన్ల కోసం నీట్ యుజిని ఎన్‌టిఎ నిర్వహిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News