న్యూఢిల్లీ: కర్నాటకలోని బళ్లారి, చిత్రదుర్గ, తుముకూరు జిల్లాలలోని గనుల నుంచి తవ్విన ఇనుప ముడి ఖనిజాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు మైనింగ్ కంపెనీలకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇందుకు సంబంధించిన పిటిషన్లపై విచారణ జరిపాయి.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఇనుప ఖనిజం ఎగుమతిపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ అధికారులు విధించిన షరతులను తప్పనిసరిగా పాటించాలని మైనింగ్ కంపెనీలను ఆదేశించింది. కర్నాటకలో ఇనుప ఖనిజం ఎగుమతులపై 2012లో సుప్రీంకోర్టు నిషేధం విధించింది. పర్యావరణ సమస్యను నివారించడం, రాష్ట్ర ఖనిజ వనరులను పరిరక్షించడం, భవిష్యత్ తరాలకు వాటిని భద్రపరచడం వంటి అంశాల ప్రాతిపదికన సుప్రీంకోర్టు ఈ నిషేధం విధించింది.