నవంబర్ 9 నుంచి రోజువారీ విచారణ
ప్రత్యేక కోర్టుకు సుప్రీం అదేశం
న్యూఢిల్లీ: తన కుమార్తెను కలుసుకునేందుకు కర్నాటకలోని బళ్లారిజిల్లాలో నవంబర్ 6వ తేదీ వరకు ఉండేందుకు కర్నాటక మాజీ మంత్రి, అక్రమ గనుల తవ్వకాల కేసులో నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. అంతేగాక..ఈ కేసు విచారణను నవంబర్ 9వ తేదీ నుంచి రోజువారీగా చేపట్టి ఆరునెల్లోకి పూర్తి చేయాలని ప్రత్యేక కోర్టును జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణ పూర్తయ్యేవరకు జనార్దన్ రెడ్డి బళ్లారిలో ఉండకూడదని కూడా ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణను జాప్యం చేయడానికి ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా జనార్దన్ రెడ్డిని కోర్టు హెచ్చరించింది. కోట్లాది రూపాయల అక్రమ మైనింగ్ కేసులో 2015 నుంచి బెయిల్‌పై ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో అనేక షరతులు విధించింది. కర్నాటకలోని బళ్లారితోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాలలో ఆయన కాలు పెట్టడానికి వీల్లేదని ఆదేశించింది. ఇటీవలే ఆడపిల్లను ప్రసవించిన తన కుమార్తెను చూసేందుకు బళ్లారికి వెళ్లేందుకు అనుమతించాలని జనార్దన్ రెడ్డి కోర్టు అనుమతి కోరారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై జనార్దన్ రెడ్డితోపాటు ఆయన బావమరిది ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ ఎండి బివి శ్రీనివాసరెడ్డిని 2011 సెప్టెంబర్ 5న బళ్లారిలో సిబిఐ అరెస్టు చేసింది.