Wednesday, January 22, 2025

నీట్‌-పిజి ప్రవేశాలకు మార్గం సుగమం

- Advertisement -
- Advertisement -
Supreme Court allows NEET-PG Counselling
ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహించాలని కేంద్రానికి సుప్రీం ఆదేశం

 

న్యూఢిల్లీ: నీట్‌-పిజి ప్రవేశాలకు మార్గం సుగమం అయింది. 2021-22 ఏడాదికి నీట్‌పిజి కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహించాలని స్పష్టం చేసింది.ఈ ఏడాది మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఒబిసిలకు 27 శాతం,ఇడబ్లుఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్ల రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే నీట్ కౌన్సెలింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి అనుమతించింది. ఇడబ్లుస్ లబ్ధిదారులను గుర్తించేందుకు రూ.8 లక్షల వార్షికాదాయం పరిమితికి కూడా ఓకె చెప్పింది. దీనికి సంబంధించి మార్చి మూడో వారంలో విచారణ జరుపుతామని, ఆ సమయంలో ఇడబ్లుఎస్ చెట్లుబాటును పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ అడ్మిషన్లు తుది తీర్పుకు లోబడి ఉంటాయని న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, ఎఎస్ బొపన్నలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇంతకు ముందు జరిగిన విచారణలో భాగంగా ఇడబ్లు ఎస్ లబ్ధిదారులను గుర్తించడానికి ఇప్పటికే ఉన్న ప్రమాణాలను కొనసాగించాలని కోర్టును కేంద్రం కోరింది.

ప్రవేశాలు, కళాశాలల కేటాయింపులు కొనసాగుతున్న సమయంలో నిబంధనలు మార్చడం వల్ల గందరగోళం నెలకొంటుందని తెలిపింది. సవరించిన నిబంధనలను వచ్చే ఏడాదికి వర్తింపజేయవచ్చని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేపట్టకుండానే ఇడబ్ల్లుఎస్ కోటాను వర్తింపజేయడానికి రూ.8 లక్షల వార్షికాదాయం పరిమితిని ప్రమాణికంగా విధించిందని నీట్‌పిజి అభ్యర్థులు కొందరు సుప్రీంకోర్టులో సవాలు చేసిన విషయం తెలిసిందే. ఆదాయంలో సంబంధం లేకుండా అయిదు ఎకరాలు, అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలను ఈ పరిమితినుంచి మినహాయించింది. దీనిపై కోర్టుకు ఇచ్చిన హామీ మేరకు ఇడబ్లుఎస్‌ను నిర్ణయించేందుకుఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, ఐసిఎస్‌ఎస్‌ఆర్ మెంబర్ సెక్రటరీ వికె మల్హోత్రా, కేంద్రానికి ముఖ్య ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్‌లతో కూడిన కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇడబ్లుఎస్‌లకు ఇప్పుడున్న రూ.8 లక్షల కుటుంబ వార్షికాదాయం పరిమితిని ప్రస్తుతానికి ఇలాగే కొనసాగించాలని డిసెంబర్ 31న కేంద్రానికి సమర్పించిన నివేదికలో ఆ కమిటీ పేర్కొంది. కమిటీ సిఫార్సులను అంగీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం తెలియజేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News